భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల విభాగానికి కొత్త కళ తెచ్చిన రెనాల్ట్ కిగర్ ఇప్పుడు కొత్త రూపంలో వచ్చింది. 2025 మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, భద్రత విషయంలో భారీ మార్పులు చేసింది. గతంలోని నాలుగు వేరియంట్లకు బదులుగా, ఇది ఇప్పుడు నాలుగు కొత్త ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవి అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్. ఈ కొత్త మోడల్ టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి ప్రముఖ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
మారుతున్న లుక్, అదనపు ఫీచర్లు
ఈ ఫేస్‌లిఫ్ట్‌లో రెనాల్ట్ కిగర్ బాహ్య రూపానికి కొత్త మెరుగులద్దారు. కారు ముందు భాగంలో కొత్తగా రూపొందించిన 10-స్లాట్ ఫ్రంట్ గ్రిల్ మధ్యలో రెనాల్ట్ కొత్త లోగో చూడవచ్చు. కొత్త బంపర్, సాటిన్ క్రోమ్ ఎయిర్ డ్యామ్, కొత్త ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఫాగ్ ల్యాంపులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, డ్యూయల్-టోన్ రంగులకు సరిపోయే కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో అమర్చారు.
కారు లోపలి భాగంలో వైట్, బ్లాక్ డ్యూయల్-టోన్ థీమ్‌తో కూడిన క్యాబిన్, అప్‌డేట్ చేసిన సీట్ అప్‌హోల్స్టరీ లభిస్తాయి. డాష్‌బోర్డు అలాగే ఉన్నా, డోర్ ప్యాడ్స్, డాష్‌బోర్డులలో కొత్త ట్రిమ్ ఇన్సర్ట్‌లను జోడించారు. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటో-క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, 7-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
భద్రతే ప్రధానం: అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, కొత్త కిగర్ ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా అందిస్తుంది. ఇది మునుపటి మోడల్‌లో టాప్ వేరియంట్లలో మాత్రమే ఉండేది. దీంతో పాటు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), హిల్ స్టార్ట్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) వంటి అధునాతన భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
రెండు శక్తివంతమైన ఇంజిన్ ఎంపికలు
ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.0 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అలాగే, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 98.6 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మ్యాన్యువల్ లేదా ఎక్స్-ట్రానిక్ సీవీటీ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది.