Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం అలర్ట్‌..! – Telugu News | IMD warned of heavy rains in Andhra Pradesh and Telangana in next 3 days due to low pressure area

హైదరాబాద్, ఆగస్ట్‌ 27: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాల సమీపంలో మంగళవారం (ఆగస్ట్‌ 26) అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. నేడు వాయువ్యదిశలో కదిలి అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. మరోవైపు తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రం మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక హైదరాబాద్‌ నగరంలో మంగళవారం శేర్లింగంపల్లి, రామచంద్రపురం, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు, కూకట్ పల్లి, ముషీరాబాద్, కాప్రా, షామీర్ పెట్, మల్కాజ్ గిరి, అల్వాల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదయింది.

ఏపీలో నేటి వాతావరణం ఇలా..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోని పోలాకిలో 11 సెంటీమీటర్లు, నరసన్నపేటలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలి హోంమంత్రి అనిత అధికారులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment