Bhumana Karunakar Reddy : ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద నిన్న వైసీపీ కీలక నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు చేశారు. లక్షకు పైన విలువ ఉండే చీరలు మాత్రమే కడతారంటూ మండిపడ్డారు. ఆమె దగ్గర లక్షలలో విలువ చేసే విగ్గులు ఉన్నాయని విమర్శలు చేశారు. సహజంగా వైసీపీ నేతలు శ్రీలక్ష్మి మీద ఇంతవరకు ఈ స్థాయిలో ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు. పైగా ఆమె జైలుకు వెళ్ళినప్పుడు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అండగా నిలిచారు. సాక్షి పత్రిక అయితే ఆమెకు ఒక రక్షణ కవచం లాగా నిలిచింది.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెను తన సిఫారసుతో ఏపీకి పిలిపించుకున్నారు. కీలక హోదా కట్టబెట్టారు. జగన్ పొలిటికల్ లెక్కలకు అనుగుణంగానే శ్రీ లక్ష్మీ పని చేశారు. వాస్తవానికి జగన్ గనక మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే శ్రీలక్ష్మికి మరింత గొప్ప స్థానాన్ని ఆయన ఇచ్చి ఉండేవారు. కానీ జగన్ అధికారంలోకి రాకపోవడంతో శ్రీలక్ష్మికి అనుకున్న హోదా లభించలేదు. ప్రస్తుతం ఆమె నామమాత్రపు శాఖలో పనిచేస్తున్నారు. శ్రీలక్ష్మికి అవినీతి ఆరోపణల కేసులో ఇటీవల తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం మూరట ఇవ్వగా.. సుప్రీంకోర్టు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో మళ్లీ తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానంలో ఆ కేసు పునః పరిశీలన మొదలైంది.
ఇది ఇలా సాగుతుండగానే శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒకరకంగా ఈ విమర్శలు టిడిపి క్యాంపును కూడా ఆశ్చర్యానికి గురిచేసాయి. భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో కీలక నాయకుడు. అటువంటి వ్యక్తి శ్రీలక్ష్మి మీద ఆ స్థాయిలో ఆరోపణలు చేయడం నిజంగానే ఏపీ రాజకీయాలలో సంచలనం కలిగించింది. అయితే శ్రీలక్ష్మి మీద కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు సాక్షి పెద్దగా విలువ ఇవ్వలేదు. వైసిపి కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు సాక్షి ఛానల్ కూడా ఆ బైట్ టెలికాస్ట్ చేయలేదు. ఈ లెక్కన చూస్తే భూమన కరుణాకర్ రెడ్డిని వైసీపీ దూరం పెడుతోందా.. సాక్షి అందుకే పట్టించుకోవడం లేదా.. అనే విశ్లేషణలు ఏపీ రాజకీయాలలో సాగుతున్నాయి. అంతేకాదు భూమన చేసిన ఆరోపణలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం విపరీతమైన ప్రయారిటీ ఇచ్చాయి. దీనినిబట్టి భూమన రాజకీయ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.