Site icon Desha Disha

ఇదెక్కడి వింత సామీ! పండ్ల తోటలపై వందల సంఖ్యలో నత్తల దాడి.. కళ్లుమూసి తెరిచేలోపు హాంఫట్‌! – Telugu News | Hundreds of snails destroying crop fields in Parvathipuram Manyam district

ఇదెక్కడి వింత సామీ! పండ్ల తోటలపై వందల సంఖ్యలో నత్తల దాడి.. కళ్లుమూసి తెరిచేలోపు హాంఫట్‌! – Telugu News | Hundreds of snails destroying crop fields in Parvathipuram Manyam district

పార్వతీపురం, ఆగస్ట్‌ 27: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. ఆరుగాలం పండించిన రైతు పంటలకు ప్రకృతి విపత్తులకు తోడు కనీవినని రీతిలో ఇప్పుడు నత్తలు తోడయ్యాయి. సాధారణంగా పంటలకు చీడ పీడలు పట్టడం, ఎలుకలు – పక్షులు పంటను నాశనం చేయడం, అకాల వర్షాలు వంటివి చూశాం..! ఏనుగులు వంటి అడవి జంతువులు పడి పాడు చేయడం గురించి కూడా అనేకసార్లు వినే ఉంటారు. చివరకు మిడతల దండు మూకుమ్మడి దాడి కూడా ఈ కలికాలంలో చూసేశాం.. కానీ కనీవినని రీతిలో నత్తలు పంటలపై దాడి చేయడం ఎప్పుడైనా విన్నారా? కనీసం ఊహకైనా వచ్చిందా? ఇప్పుడిదే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని గంగరేగువలసలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా మారింది. అసలేం జరిగిందంటే..

గ్రామంలోని కందులపాటి సాయిబాబు అనే రైతుకు 7 ఎకరాల పొలం ఉంది. ఇందులో అతడు బొప్పాయి, జామ, పోక చెక్క వంటి రకరకాల పంటలు పండిస్తున్నాడు. అయతే గత 15 రోజులుగా తోటలోకి ఎక్కడి నుంచి వచ్చిపడ్డాయో తెలియదుగానీ పెద్ద సంఖ్యలో నత్తలు వరుసపెట్టి రాసాగాయి. తొలుత పెద్దగా పట్టించుకోని రైతు సాయిబాబు.. క్రమంలో నత్తలు చెట్లపైకి పాకి పంట మొత్తం తినేయడంతో కంగారు పడ్డాడు. ఇప్పటికే 4 ఎకరాల మేర పంటలను తినేశాయి. ఇక అంతర పంటగా వేసిన 5 వేల టమాటా మొక్కల సంగతి సరేసరి. కళ్ల ముందే తన తోట మొత్తం నత్తలు హాంఫట్‌ చేస్తుంటే ఏం చేయాలో తెలియక గగ్గోలు పెడుతున్నాడు.

అసలు అవి ఇంత పెద్ద మొత్తంలో అక్కడికి ఎలా వచ్చాయో కూడా తెలియడం లేదంటూ లబోదిబోమంటున్నాడు. అయితే తోటల సమీపంలో జంఝావతి జలాశయం ఉండటంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన నీటితో ఇవి కొట్టుకు వచ్చాయేమోనని స్థానికులు భావిస్తున్నారు. తొలుత పదుల సంఖ్యలో వచ్చాయని, ఆ తర్వాత వందల్లో దండు మాదిరి వచ్చి పంటను తినేయడం మొదలెట్టాయని రైతు సాయిబాబు వాపోతున్నాడు. ప్రస్తుతం ఈ నత్తల దండు పక్క తోటలపై కూడా దాడి చేస్తున్నాయని, వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గడ్డ ఉప్పును పంటల్లో వేస్తే నత్తలను అడ్డుకోవచ్చని ఉద్యానశాఖ అధికారి గిరిజ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Exit mobile version