Site icon Desha Disha

Tamil Nadu politics : హీరో విజయ్ తమిళ సీఎం అవుతాడా? అంత కెపాసిటీ ఉందా?

Tamil Nadu politics : హీరో విజయ్ తమిళ సీఎం అవుతాడా? అంత కెపాసిటీ ఉందా?

Tamil Nadu politics : సీనియర్ ఎన్టీఆర్, ఎంజీ రామచంద్రన్, పవన్ కళ్యాణ్.. రీల్ లైఫ్ లో నుంచి రియల్ లైఫ్ లో నాయకులుగా ఎదిగిన వారు.. ఇప్పుడు ఈ జాబితాలో చేరడానికి తమిళనాడు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు విజయ్ ఆరాట పడుతున్నారు. ఇటీవల ఆయన తమిళగ వెట్రి కళగం అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు.. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన పార్టీ ఆధ్వర్యంలో రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అధికార డిఎంకెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీని కూడా వదిలిపెట్టడం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని.. కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత భారీగా సభలు

మానాడు పేరుతో ఆయన ఇటీవల మధురై ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభకు లక్షలాది మంది జనం వచ్చారు. ఒకరకంగా ఆ సభకు వచ్చిన జనంతో ఆ ప్రాంతం ఒక జాతరను తలపించింది. తన పార్టీ ఆవిర్భావ సభను కూడా విజయ్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించని విధంగా భారీ ఏర్పాట్లు చేసి.. తమిళనాడు రాజకీయాలలో సరికొత్త చరిత్ర సృష్టించారు. భారీగా వస్తున్న జన సందోహం నేపథ్యంలో టీ వీ కే పార్టీలోకి చేరికలు కూడా భారీగానే ఉంటున్నాయి. ఒక రకంగా ఎన్నికలకు ముందు ఇది తమకు సానుకూల సంకేతం అని విజయ్ చెబుతున్నారు. వాస్తవానికి విజయ్ చెబుతున్నట్టుగా తమిళనాడులో అంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? విజయ్ కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు తమిళ రాజకీయ విశ్లేషకులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు.

రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ..

ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నారు. స్టాలిన్ విజయవంతంగా తన ఐదు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు ఉదయనిధి కొనసాగుతున్నారు. ఉదయనిధి సినిమా నటుడిగా తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే. ఉదయనిధి ని వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రిని చేయాలని స్టాలిన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే స్టాలిన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ప్రస్తుతం ఆయన వయసు 7 పదులు దాటింది. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఉదయ నిధి, విజయ్ ని పరిశీలనలోకి తీసుకుంటే విజయ్ కే ఎక్కువ మార్కులు పడతాయి. విజయ్ కి వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది. ఉదయనిధి ఆ విషయంలో అంతగా ఆకట్టుకోలేడు. యువతలో కూడా విజయ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరోవైపు డీఎంకేకి అలగిరి నుంచి ఇబ్బంది ఉండనే ఉంది. మధురై, సేలం, కంచి జిల్లాలలో అలగిరి కి బలమైన అనుచర వర్గం ఉంది. పైగా ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపించాలని అలగిరి వర్గం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలగిరి కరుణానిధి పెద్ద భార్య కుమారుడు. మొదటినుంచి కూడా స్టాలిన్, అలగిరి మధ్య విభేదాలు ఉండనే ఉన్నాయి.

గత ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే..

ఇక అన్న డీఎంకే నుంచి ముఖ్యమంత్రి స్థానానికి పన్నీర్ సెల్వం, పలని స్వామి మధ్య పోటీ ఉండనే ఉంది. పైగా ఈ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కే అవకాశం లేదని తమిళనాడు సర్వేలు చెబుతున్నాయి. అన్న డీఎంకే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 74 స్థానాలను దక్కించుకుంది.. అధికార ఇండియా కూటమి 159 స్థానాలు దక్కించుకుంది. ఎన్డీఏ కూటమిలో బిజెపికి నాలుగు స్థానాలు లభిస్తే.. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు లభించాయి. మొత్తంగా తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.. మరోవైపు డీఎంకే పార్టీలో కొంతమంది నాయకులు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇసుక, ఖనిజాల అక్రమ రవాణా కేసుల్లో డీఎంకే నేతలు పీకల్లోతు కూరుకుపోయారని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా విజయ్ ఊహించినట్టు తమిళనాడులో రాజకీయాలలో శూన్యత ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేకపోవడం వల్ల విజయ్ ఆశించినట్టుగా ఫలితం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టారని.. కనీసం ఆయన కూడా గెలవలేకపోయారని ఈ సందర్భంగా విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. “క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం లేనప్పుడు ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. సభలు సమావేశాలకు భారీగా జనం వచ్చినంతమాత్రాన అధికారం దక్కదు. ఉద్వేగపూరితమైన ప్రసంగాల ద్వారా ఈలలు, చప్పట్లు వస్తాయేమో గాని.. ఓట్లు దక్కవని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version