Sri Chaitanya ragging incident: చదువుకోవడానికి వెళ్లిన వాడు అదే పనిచేయాలి.. సైట్ కొడుతా.. ర్యాగింగ్ చేస్తాను.. ఇష్టమొచ్చినట్టు ఉంటానంటే కుదరదు. కానీ కొన్ని యాజమాన్యాలు.. బడా కార్పొరేట్ స్కూళ్లు కాలేజీల్లో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. తోటి విద్యార్థులను ర్యాగింగ్ పేరిట చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ప్రాణాలు తీసేంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం.. వీళ్లు విద్యార్థుల మానవమృగాలా అని అనిపించకమానదు. సభ్య సమాజంలో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేవరకూ జూనియర్లు.. సీనియర్ల చేతిలో ఇలా బలైపోతూనే ఉంటారు.
కోనసీమ జిల్లా రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూల్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రసాద్(16)ను తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా వేధించారు. కేవలం సరదాగా మొదలైన ఈ హింస చివరికి భయంకర రూపం దాల్చింది. ప్రసాద్ పొట్ట, చేతులపై హాట్ ఐరన్ బాక్స్‌తో కాల్చడం ద్వారా శారీరకంగా, మానసికంగా తీవ్ర గాయాలు మిగిల్చారు.
విద్యార్థి తల్లి తన కుమారుణ్ని చూసేందుకు హాస్టల్‌కు వెళ్లినప్పుడు అతని శరీరంపై గాయాలను గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“ఇలాంటి క్రూరకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ర్యాగింగ్ పేరుతో పసివాళ్ల భవిష్యత్తు చెడగొట్టే విద్యార్థుల్ని కఠినంగా శిక్షించాలి” అని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఇక విద్యార్థుల భద్రత విషయంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్‌లో పర్యవేక్షణ లేకపోవడం, విద్యార్థుల మధ్య శ్రద్ధ చూపకపోవడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
సమాజానికి హెచ్చరిక
ర్యాగింగ్ అనే పాత పద్ధతి ఇప్పటికే అనేక ప్రాణాలు తీసింది. అయినప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో ఈ దురాచారం ఇంకా కొనసాగుతుండటం కలచివేస్తుంది. విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, పర్యవేక్షణను కఠినంగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి ఘటనలను నివారించవచ్చు. ప్రసాద్ ఘటన మరోసారి స్పష్టం చేసింది.. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం అసలు సహించరాని విషయం.
https://x.com/oktelugunews/status/1960278092804669853