High alert in North Andhra: ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్రలో( North Andhra) భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. హోం శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వర్ష తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిత్యం పరిస్థితులను సమీక్షించాలని.. అవసరం అనుకుంటే ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగులు, కూలిన చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు మంత్రి అనిత.
రెండు రోజుల పాటు వానలు
అల్పపీడనం నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం( Srikakulam ), మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రోజు కూడా విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్,గుంటూరు, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో సైతం తేలికపాటి వర్షాలు కొనసాగుతాయి.
శ్రీకాకుళం పై సమీక్ష..
మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు శ్రీకాకుళం జిల్లాలో ( Srikakulam district)భారీ వర్షాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ తో మాట్లాడారు. ప్రస్తుతం శ్రీకాకుళం డివిజన్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో 11 తీర మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు జిల్లా అధికారులు. కాలువలతోపాటు చెరువులకు గండ్లు పడకుండా చూడాలని ఆదేశించారు. మరోవైపు శ్రీకాకుళం రెవిన్యూ డివిజన్లో భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరో వర్కింగ్ డే లో పాఠశాలలను నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది.