Site icon Desha Disha

బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం..! – Telugu News | BJP may get new national president ahead of Bihar polls announcement: Sources

బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన బీజేపీ-ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం..! – Telugu News | BJP may get new national president ahead of Bihar polls announcement: Sources

ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. మరో నెల రోజుల్లో జాతీయ అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది..2024 జులైలోనే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో డిసెంబర్ లో ప్రారంభమైన బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ త్వరలో ముగియనుంది. సెప్టెంబరు 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల తరువాత బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తికానుంది. ఇందుకోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం నూతన జాతీయ అధ్యక్ష పదవిలో ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై దృష్టి సారించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కానున్నట్లు సమాచారం.

బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 28 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. త్వరలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటే బీజేపీ రాజ్యాంగం ప్రకారం 36 స్టేట్, కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం 19 యూనిట్లకు అధ్యక్షుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే గత నెలలోనే 28 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తైంది..

ఆర్ఎస్ఎస్ తో బీజేపీ సంప్రదింపులు

నూతన అధ్యక్షుడు ఎవరన్నదానిపై బీజేపీ అగ్ర నాయకత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంప్రదింపులు జరుపుతుంది.. ఈ ఎంపికను బీజేపీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధ్యక్షుడిని ఎన్నుకోవడం ద్వారా పార్టీ బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎంపిక కేవలం ఒక పదవి గురించి కాదు..ఇది దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక నిర్ణయం. సెప్టెంబర్‌లో జోధ్‌పూర్ సమావేశం తర్వాత, బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమవుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దేశంలోని రాజకీయ శక్తుల సమతుల్యతను, బీజేపీ భవిష్యత్ వ్యూహాలను నిర్ణయించే కీలక అడుగు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకత్వం ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తున్నాయి..

సెప్టెంబర్ లో ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాలు

సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వ సమావేశం కానుంది. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ సమావేశాల్లో పాల్గొననున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, ముఖ్య సంఘ్ నేతలు, అనుబంధ విభాగాల నేతలు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యనేతలు హాజరవుతారు.

అధ్యక్షుడి ఎంపికలో ఆర్ఎస్ఎస్ కీలకం

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకు పరిమితమైన తర్వాత, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కీలక పదవుల ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ సైతం ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి నేతల వదిలేయకుండా సిద్ధాంతపరంగా నియామకాలు, కార్యక్రమాలు ఉండేలా ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తుంది. పార్టీకి అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించనుంది. ఈసారి అధ్యక్షుడు తమవారే అయి ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ ఖచ్చితంగా భావిస్తోంది. పార్టీని సమర్ధవంతంగా నడిపే వ్యక్తి, యాక్టివ్ గా, క్రమశిక్షణ కలిగిన, సంఘ్ పరివార్ వ్యవస్థలో లోతైన మూలాలు కలిగిన హిందూత్వ విధేయుడు, నరేంద్ర మోదీతో కలసి పార్టీని సజావుగా నడిపించగల వ్యక్తి ఎవరనేదానిపై ఆర్ఎస్ఎస్-బీజేపీ దృష్టి సారించాయి.

అధ్యక్ష రేసులో ఎవరున్నారంటే..!

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ఆపార్టీ సీనియర్ నేతలు RSS నేపథ్యం ఉన్న కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కేంద్రమంత్రులుగా ఉన్న శివరాజ్‌సింగ్ చౌహన్,ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ జోషి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

శివరాజ్ సింగ్ చౌహాన్

శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా (2005-2023) 17 ఏళ్ల అనుభవం. బలమైన రాజకీయ ఇమేజ్, ఓబీసీ నేపథ్యం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన ఈ పదవికి బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారు.1959లో జన్మించిన చౌహాన్, మధ్యప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2005-2023 వరకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, రాష్ట్రంలో పార్టీకి వరుస విజయాలు అందించారు.

2024 లోక్‌సభ ఎన్నికలలో విదిషా నియోజకవర్గం నుంచి 8.2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓబీసీ (కిరార్) సమాజానికి చెందిన చౌహాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఓబీసీ సమాజాల మద్దతును బలోపేతం చేయగలరు. మధ్యప్రదేశ్‌లో మామాగా పిలవబడే చౌహాన్, లాడ్లీ బహన యోజన, ముఖ్యమంత్రి తీర్థ దర్శన యోజన వంటి పథకాల ద్వారా విస్తృత జనాదరణ సంపాదించారు. సరళ జీవనశైలి, అవినీతిరహిత ఇమేజ్ ఆయనకు బలమైన రాజకీయ గుర్తింపును అందించాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చౌహాన్, ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు..

ధర్మేంద్ర ప్రధాన్

ఒడిశాలోని తల్చేర్‌లో 1969లో జన్మించిన ధర్మేంద్ర ప్రధాన్, ఉత్కల్ విశ్వవిద్యాలయం నుంచి ఆంత్రోపాలజీలో ఎం.ఏ. పూర్తి చేశారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తగా ప్రారంభించారు. ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్ష రేసులో ఉన్నారు. బీజేపీ OBC ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లగల సామర్థ్యం, RSSలో ప్రస్తుత నెంబర్ 2 అయిన దత్తాత్రేయ హోసబాలేతో ఉన్న సంబంధాలు, సైద్ధాంతికంగా రాజకీయంగా చురుకైన అభ్యర్థిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉండటం కీలకంగా మారాయి. హర్యానా, ఒడిశా, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది ఆయనను పార్టీలో అల్టిమేట్ పార్టీ మాన్ గా చేసింది. బీజేపీ అధ్యక్ష ఎన్నికలో ఒడిశా నుంచి ఎవరూ ఇప్పటివరకు ఈ పదవిని చేపట్టలేదు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్నికైతే అది చారిత్రాత్మకంగా ఉంటుంది. గత పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ అమిత్ షాలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.

భూపేందర్ యాదవ్

రాజస్థాన్‌కు చెందిన భూపేంద్ర యాదవ్ పార్టీలో ఎన్నికల వ్యూహకర్తగా, సంస్థాగత నైపుణ్యం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. న్యాయవాది, ఓబీసీ సామాజిక సమీకరణం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో లోతైన సంబంధాలు, అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు భూపేంద్ర యాదవ్ అవకాశాలను బలపరుస్తున్నాయి.2020 బీహార్, 2023 మధ్యప్రదేశ్, 2024 మహారాష్ట్ర ఎన్నికలలో భూపేంద్ర యాదవ్ ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఇది ఆయనను సమర్థవంతమైన వ్యూహకర్తగా నిరూపించింది. ఓబీసీ నాయకుడిగా, యాదవ్ బీజేపీకి బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యాదవ సమాజం, ఇతర వెనుకబడిన తరగతుల మద్దతును బలోపేతం చేయగలరు. అంతేగాక రాజస్థాన్ నుంచి గత 45 సంవత్సరాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరూ ఎన్నిక కాలేదు. యాదవ్ ఓబీసీ నేపథ్యం, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు అధ్యక్ష రేసులో ఆయనను ముందంజలో ఉంచుతున్నాయి.

మనోహర్ లాల్ ఖట్టర్

మనోహర్ లాల్ ఖట్టర్ ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి (2014-2024) అయిన ఖట్టర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో లోతైన సంబంధాలు, సంస్థాగత నైపుణ్యం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ 1954లో రోహ్‌తక్ జిల్లాలోని నిందన గ్రామంలో జన్మించిన ఖట్టర్, 1977లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి, 1980లో పూర్తి సమయం ప్రచారక్‌గా మారారు. 1994లో బీజేపీలో చేరిన ఆయన, 2000-2014 మధ్య హర్యానాలో సంగఠన్ మహామంత్రిగా పనిచేశారు. 2014లో హర్యానా ముఖ్యమంత్రిగా ఎన్నికై, రాష్ట్రంలో బీజేపీ మొదటి ప్రభుత్వాన్ని నడిపించారు. హర్యానాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఖట్టర్ కీలక పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికలలో ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో పార్టీ విజయానికి దోహదపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో 17 సంవత్సరాల ప్రచారక్ అనుభవం మోదీతో 1990లలో సంస్థాగత రంగంలో కలిసి పనిచేసిన అనుబంధం ఉంది. సరళమైన జీవనశైలి, అవినీతి రహిత ఇమేజ్, కఠిన నిర్వాహకుడిగా పేరు పొందారు. అయితే 2024 ఎన్నికల్లో పది స్థానాల్లో ఐదు మాత్రమే గెలవడంతో ఖట్టర్ కి అధ్యక్ష అవకాశాలు తక్కువే అన్న చర్చ జరుగుతుంది

అధ్యక్ష రేసులో మరికొందరి పేర్లు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నవారితో పాటు మరికొందరి పేర్లను బీజేపీ- ఆర్ఎస్ఎస్ పరిశీలిస్తుంది. సంజయ్ జోషి, వసుంధరా రాజే, వినోద్ తావ్డే పేర్లు సైతం అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఊహాగానాలు ఎంత ఉన్నా చివరికి చర్చల్లో లేని వ్యక్తి ఎంపిక అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. 2009లో నితిన్ గడ్కరీ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగిన సందర్భం దీనికి ప్రధాన ఉదాహరణ. అప్పట్లో కేవలం 52 ఏళ్ల వయసులోనే గడ్కరీ జాతీయ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. పార్టీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టేందుకు యువ శక్తిని నింపడానికి సైద్ధాంతిక సమన్వయాన్ని తీసుకురావడానికి గడ్కరీ నియామకం జరిగింది.

ఏకాభిప్రాయంతోనే ఎన్నిక

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ఏకాభిప్రాయాన్ని ఇష్టపడతారు. దీనికి వారాలు, నెలలు కూడా చర్చలు జరుగుతాయి. 2024 జూలైలోనే జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన తరువాత ఢిల్లీ ఎన్నికల కోసం, తరువాత ఆపరేషన్ సిందూర్‌, ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం జాతీయ అధ్యక్ష ఎన్నిక ఆలస్యం అవుతుంది. ఆగస్టు 2025 నాటికి, పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అవసరమైన కోరంను సాధించింది. బీజేపీ రాజ్యాంగం ప్రకారం, పార్టీ కనీసం 50 శాతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతర్గత ఎన్నికలను పూర్తి చేయాలి. ఆ పరిమితి దాటిపోయింది. 18 కంటే ఎక్కువ రాష్ట్ర యూనిట్లు ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. అయితే ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్ మరియు ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నిక పూర్తికాలేదు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, RSS చీఫ్ మోహన్ భగవత్ ఇద్దరూ పదవీ విరమణ 75 ఏళ్లకు చేరుకోవడంతో, ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రస్తుతం కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ నమ్మకాన్ని, మోదీ విశ్వాసాన్ని, కార్యకర్తల గౌరవాన్ని పొందవలసి ఉంటుంది. 2026 లో ఎన్నికలు జరగనున్న ప్రతిపక్ష పాలిత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికలలో గెలవడం చాలా ముఖ్యం. ఈ అంశాల నేపథ్యంలో ఆచితూచి బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి నూతన జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Exit mobile version