Site icon Desha Disha

ట్రంప్ సుంకాల నుంచి గట్టెక్కేందుకు భారత్ యత్నాలు..

ట్రంప్ సుంకాల నుంచి గట్టెక్కేందుకు భారత్ యత్నాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠినమైన సుంకాల నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భారత ఎగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో, వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న రెండో లాబీయింగ్ సంస్థను రంగంలోకి దించింది. ఈ మేరకు మెర్క్యురీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థతో భారత రాయబార కార్యాలయం ఒప్పందం కుదుర్చుకున్నట్లు నివేదిక వెల్లడించింది. అమెరికా ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో సహాయపడేందుకు ఈ సంస్థను నియమించుకున్నట్టు న్యాయ శాఖకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం, ఆగస్టు మధ్య నుంచి నవంబర్ మధ్య వరకు మూడు నెలల కాలానికి గాను మెర్క్యురీ సంస్థకు భారత్ ప్రతినెలా 75,000 డాలర్లు (సుమారు రూ. 63 లక్షలు) చెల్లించనుంది. మొత్తం మీద ఈ ఒప్పందం విలువ 2,25,000 డాలర్లు. భారత ఎగుమతులపై ఇప్పటికే 25 శాతం సుంకం విధించిన అమెరికా… రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు దీనికి అదనంగా మరో 25 శాతం సుంకాన్ని విధించింది. ఈ అదనపు సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ లాబీయింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన బ్రయాన్ లాంజా వంటి కీలక వ్యక్తులు మెర్క్యురీ సంస్థలో ఉండటం గమనార్హం. అయితే, కొత్త సుంకాలు అనుకున్న ప్రకారమే అమలవుతాయని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో గత వారం స్పష్టం చేశారు. ఁరక్తపాతంలో తమ పాత్రను గుర్తించేందుకు భారత్ ఇష్టపడటం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ట్రంప్ మాజీ సలహాదారు జాసన్ మిల్లర్‌కు చెందిన ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌సి సంస్థకు భారత్ ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. ఇప్పుడు మెర్క్యురీని కూడా నియమించుకోవడంతో, సుంకాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు భారత్ ఎంతగా ప్రయత్నిస్తోందో అర్థమవుతోంది.

Exit mobile version