తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫై చేసిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది.
ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని తెలిపింది. గడువు ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొంతకాలంగా క్రితం పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2024 జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు.. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అయితే దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..