Site icon Desha Disha

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) మంగళవారం హెచ్చరించింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాయవ్య బంగాళాఖాతంలో, ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version