Site icon Desha Disha

తప్పుడు ఆరోపణలు చేస్తారా?

తప్పుడు ఆరోపణలు చేస్తారా?

అమెరికా రాయబారిపై ఫ్రాన్స్‌ ఆగ్రహం

పారిస్‌ : యూదుల సంస్కృతీ సంప్ర దాయాల పరిరక్షణ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన అమెరికా రాయబారి ఛార్లెస్‌ కుష్‌నర్‌ను ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ తన కార్యాలయానికి పిలిపించింది. యూదు వ్యతిరేక హింసను అడ్డుకునే విషయంలో ఫ్రాన్స్‌ తగిన చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌కు కుష్‌నర్‌ ఓ లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన విదేశాంగ శాఖ ఆయనను పిలిపించి తన అభ్యంతరాన్ని తెలియజేసింది. వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పత్రికకు రాసిన ఓ బహిరంగ లేఖలో ఇజ్రాయిల్‌పై ఫ్రాన్స్‌ చేస్తున్న విమర్శలను కుష్‌నర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఇజ్రాయిల్‌పై ఆరోపణలు సంధిస్తూ, పాలస్తీనాను గుర్తించే దిశగా ఇస్తున్న సంకేతాలు ఇవ్వడం ఫ్రాన్స్‌లో నివసిస్తున్న యూదులకు ముప్పు కలిగిస్తాయి. తీవ్రవాదులకు ఊతమిస్తాయి. హింసను పెంచుతాయి’ అని ఆయన ఆ లేఖలో రాశారు. దీనిపై ఫ్రాన్స్‌ వెంటనే స్పందించింది. కుష్‌నర్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. ఓ రాయబారి నుంచి ఇలాంటి ఆరోపణలు రావడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. యూదు వ్యతిరేకతపై పోరాడే విషయంలో ఫ్రాన్స్‌ చిత్తశుద్ధితో ఉన్నదని స్పష్టం చేసింది.

కుష్‌నర్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని, ముఖ్యంగా ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో తలదూర్చ రాదన్న సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నాయని మండిపడింది. కాగా కుష్‌నర్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ శాఖ సమర్ధించింది. ఆయన ఫ్రాన్స్‌లో అమెరికా ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, తమ దేశ ప్రయోజనాల పరిరక్షణలో గొప్ప కృషి చేస్తున్నారని వెనకేసుకొచ్చింది. కుష్‌నర్‌కు ఎంతో ‘ఘనమైన’ చరిత్ర ఉంది. పన్ను ఎగవేత, సాక్ష్యాలను తారుమారు చేయడం, మోసం వంటి ఆరోపణలపై ఆయన అమెరికా జైలులో రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత ఆయనకు దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించారు. ఫ్రాన్స్‌లో అమెరికా రాయబారిగా విధులు చేపట్టి నెల రోజులు మాత్రమే అయింది. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాగతాల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మళ్లించడానికి, సమస్యపై చర్చను పక్కదారి పట్టించడానికి ఇజ్రాయిల్‌ మద్దతుదారులు తరచుగా ప్రత్యర్థులపై యూదు వ్యతిరేక ఆరోపణలు చేస్తుంటారు.

The post తప్పుడు ఆరోపణలు చేస్తారా? appeared first on Navatelangana.

Exit mobile version