Site icon Desha Disha

Prakash Raj: చంద్రబాబు, పవన్ మధ్య ప్రకాష్ రాజ్ చిచ్చు!

Prakash Raj: చంద్రబాబు, పవన్ మధ్య ప్రకాష్ రాజ్ చిచ్చు!

Prakash Raj: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. కిందిస్థాయితోపాటు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరవడుతోంది. అయినా సరే ఎప్పటికప్పుడు ఇరు పార్టీల అధినేతలు సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం నడుస్తుందని.. చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తామని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని కూడా తేల్చి చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతోంది. తెలుగుదేశం పార్టీకి బిజెపి అన్ని విధాలా సహకారం అందిస్తోంది. కానీ ఎక్కడో లోలోపల గత అనుభవాల దృష్ట్యా.. పవన్ కళ్యాణ్ ను పట్టుకొని బిజెపి పొలిటికల్ డ్రామాకు తెరతీస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇదే అనుమానం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబుకు అనుమానం వచ్చేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందరూ అనుమానపు చూపులు చూసేలా ఈ ట్వీట్ ఉంది.

Also Read: ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకు.. చివరకు 13 ఏళ్ల బాలికను కూడా వదలలేదు!

* సభలో వివాదాస్పద బిల్లు..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం( central government) ఓ వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఏదైనా కేసులో అరెస్ట్ అయిన ప్రజాప్రతినిధులు 30 రోజుల పాటు జైల్లో ఉంటే.. 31 వ రోజు రాజీనామా చేయకుండా పదవి కోల్పోవాల్సి ఉంటుంది. అటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం పొందాక.. ఉభయసభల్లో చర్చించి సవరణలు తీసుకొచ్చి ఆమోదం పొందాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. ఈ బిల్లు పరిధిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను చేర్చారు. పారదర్శక పాలన, నేర సంస్కృతిని నియంత్రించేందుకే ఈ సంచలన బిల్లు ప్రవేశపెట్టినట్లు బిజెపి చెబుతోంది. అయితే విపక్ష ముఖ్యమంత్రులను, ప్రభుత్వాలను అచేతనంగా చేసేందుకేనని విపక్షాలు అనుమానిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

* ఏపీ రాజకీయాలతో ముడిపెడుతూ..
అయితే బిజెపి( BJP) విధానాలను ఎప్పుడు వ్యతిరేకిస్తుంటాడు నటుడు ప్రకాష్ రాజ్. అయితే ఈ బిల్లును ఏపీ రాజకీయాలతో ముడి పెడుతూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మహాప్రభు నాకు చిన్నపాటి సందేహం. ప్రస్తుత ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని పక్కకు తప్పించి.. మీకు ఇష్టమైన డిప్యూటీ సీఎంను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకేనా ఈ బిల్లు అంటూ ప్రశ్నించారు. ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును ఏపీ రాజకీయాలకు ముడి పెడుతూ ప్రకాష్ రాజ్ సంధించిన ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ మధ్య మంచి బంధం కొనసాగుతోంది. కానీ పవన్ చర్యలపై అనుమానం కలిగేలా, కేంద్రంపై చంద్రబాబుకు సందేహం రేగేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది. ఇప్పటికే బిజెపి చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాల మధ్య అగాధం రేపింది. ఒక పక్షాన్ని నిలువరించేందుకు మరో మిత్రపక్షంతో కుట్ర చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు విషయంలో సైతం పవన్ తో ఆ పని చేయిస్తుందని అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ ఉంది.

Exit mobile version