మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో బాగా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో కూడా నష్టాలు కలుగుతాయి. ఆదాయంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక సమస్యలు విజృంభించే అవకాశం ఉంటుంది. బాగా సన్నిహితులైన బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా మోసపోవడం, నష్టపోవడం జరుగుతుంది. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అవుతారు. ఈ రాశివారు శనికి ప్రదక్షిణలు చేయడంతో పాటు తప్పనిసరిగా శివార్చన చేయించడం మంచిది.
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగం కోల్పోవడం, పని భారం పెరగడం, అధికారుల వేధింపులకు గురి కావడం, జూనియర్లకు పదోన్నతులు లభించడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగాలకు భంగం ఏర్పడుతుంది. ఉద్యోగులు కూడా ఎక్కువ కాలం ఉద్యోగం లేకుండా ఉండాల్సి వస్తుంది. ఈ రాశివారు శనీశ్వరుడికి ప్రతి శనివారం ప్రదక్షిణలు చేయడం మంచిది.
సింహం: ఈ రాశికి శని అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రావాల్సిన డబ్బు అందక, ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వ లేక అవమానాల పాలు కావాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అష్టమ శని ఉన్నంత కాలం కొత్త కార్యక్రమం చేపట్టకపోవడం మంచిది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ప్రతి శనివారం శనికి దీపం వెలిగించడం మంచిది.
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో విభేదాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ఫలించకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబపరంగా చికాకులుంటాయి. ఇవి తగ్గుస్థాయిలో ఉండాలన్న పక్షంలో శివాభిషేకంతో పాటు, శనికి తిలాదానం చేయించడం మంచిది.
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబంలో సుఖసంతోషాలు తగ్గుతాయి. సుఖనాశనం జరుగుతుంది. ఆస్తి సమస్యలు పెరుగుతాయి. సొంత ఇంటి నిర్మాణానికి విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు కాస్తంత ఎక్కువగా అనుభవానికి వస్తాయి. శివార్చనతో పాటు నల్ల రంగు కలిసిన దుస్తులు ధరించడం వల్ల ఈ కర్మకారకుడు తృప్తి చెందే అవకాశం ఉంది.
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వృద్ధి చెందుతాయి. బాగా సన్నిహితులైన బంధుమిత్రులు దూరం అవుతారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఉద్యోగంలో అధికారులు అలవికాని లక్ష్యాలు, భారీ బాధ్యతలతో ఒత్తిడి పెంచుతారు. రావలసిన డబ్బు చేతికి అందదు. ఇంట్లో తరచూ రుద్రాభిషేకం చేయించడం, శనికి ప్రదక్షిణలు చేయించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగింది. దుష్కర్మల ఫలాలను ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు బాగా పీడిస్తాయి. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతానికి బదిలీ కావచ్చు. పది మందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అనవసర పరిచయాలు, నష్టదాయక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. శనికి ప్రదక్షిణలు చేయడంతో పాటు, తిలలు, మినుములు దానం చేయడం వల్ల ఈ శని దోషం తగ్గుతుంది.