Prayagraj Flood: యూపీలో ‘బాహుబలి’ సీన్లు.. యోగీ సర్కార్‌కు చీవాట్లు

Prayagraj Flood

Prayagraj Flood: ఈ ఏడాది వానాకాలం ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తోంది. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లో నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు బిహార్, అసోం, గుజరాత్, రాజస్థాన్‌లోనూ వరదలు అతలాకుతలం చేశాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున నదులు పొంగడంతో నివాస ప్రాంతాలు నీటమునిగాయి. కరేలా బాగ్‌ వంటి లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ప్రజలు రోడ్లపై పడవలు ఉపయోగించి ప్రయాణించే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిస్థితులు 2013లో ఉత్తరాఖండ్‌ వరదలను గుర్తుకు తెచ్చాయి.

Also Read: కింగ్డమ్ సినిమాను ఆ ఇద్దరు దర్శకులైతే పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసేవారా..?

‘బాహుబలి’ సీన్‌ రిపీట్‌..
ప్రయాగ్‌రాజ్‌లో వరదల కారణంగా దంపతులు తమ అనారోగ్యంలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీటిలో మునిగిన రోడ్లపై పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ‘బాహుబలి’ సినిమాలోని హీరో శివుడు శివలింగాన్ని ఎత్తి ఉంచిన దృశ్యాన్ని గుర్తుకు తెచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. నెటిజన్లు ఈ సంఘటనను హృదయవిదారకంగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వరద నిర్వహణలో విఫలమైందని విమర్శిస్తున్నారు.

రంగంలోకి రెస్క్యూ బృందాలు..
వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు రక్షణ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో రెండు బోట్లను ఉపయోగించి చిక్కుకున్న వ్యక్తులను కాపాడారు. అలాగే, ఆహార పంపిణీ కార్యక్రమాలను కూడా చేపట్టారు. అయినప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ ఇబ్బందులను వెల్లడిస్తూ, సత్వర సాయం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యోగీ ప్రభుత్వంపై విమర్శలు..
వరద నిర్వహణలో యోగీ ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో బలంగా వినిపిస్తున్నాయి. గంగా, యమున నదులు ఉప్పొంగడంతో ప్రయాగ్‌రాజ్‌లోని ఐదు జిల్లలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రతాప్‌గఢ్, గోండాలో ఒక్కొక్కరు మరణించిన సంఘటనలు ఈ విమర్శలకు ఊతమిచ్చాయి. ప్రభుత్వం అత్యవసర సాయం, నీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడంలో వెనుకబడిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో గంగా నదీ పరీవాహక ప్రాంతంలో 22% వరద ప్రభావిత భూభాగం ఉత్తరప్రదేశ్‌లోనే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. 2025 ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాలకు రూ.1,554.99 కోట్ల వరద సాయం నిధులను విడుదల చేసినప్పటికీ, ఈ నిధుల వినియోగంలో సమర్థత, పారదర్శకత అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Leave a Comment