Meghnad Desai: మేఘనాథ్‌ దేశాయ్ కన్నుమూత…ప్రధాని సంతాపం… ఇంతకీ ఎవరీ దేశాయ్‌..? – Telugu News | Eminent economist writer meghnad desai passes away pm modi expresses condolences

భారత్‌లో జన్మించి, బ్రిటన్‌లో స్థిరపడ్డ ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత మేఘనాథ్ దేశాయ్(84) కన్నుమూశారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా కొనసాగిన లార్డ్ మేఘనాథ్ దేశాయ్ అనారోగ్యంతో మరణించారు. ఆయన మారణవార్త ప్రపంచ విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. మేఘనాథ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఆయన గొప్ప మేధావిగా అభివర్ణించారు. విద్యారంగంలో, ఆర్థిక సంస్కరణల్లో ఆయన చేసిన కృషి అపారమైనదిగా ప్రధాని కొనియాడారు. 2009లో మేఘనాథ్‌ను పద్మభూషణ్‌ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది.

1940లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన దేశాయ్ భారతీయ, బ్రిటిష్ మేధో వర్గాలలో గొప్ప వ్యక్తిగా నిలిచారు. 1963లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. రెండేళ్ల అనంతరం లండన్‌ వెళ్లారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE)లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రపంచ ఆర్థిక శాస్త్రం, మార్క్సిజం, భారతీయ రాజకీయాలపై ఆయన రచించిన పుస్తకాలు అనేక ప్రశంసలు పొందాయి. 1991లో ఆయన లేబర్‌ పార్టీ తరపున హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లేబర్ పీర్‌గా నియమితులయ్యారు, తరువాత క్రాస్‌బెంచ్ సభ్యుడయ్యారు.

లార్డ్ దేశాయ్ తన మనసులోని మాటను నిక్కచ్చిగా బయటపెట్టేవారు. లెఫ్టిస్ట్‌, రైటిస్ట్‌ భావజాలాలను సమభావంతో ఎండగట్టారు. ఆయన అత్యంత ప్రసిద్ధ రచనలలో మార్క్స్ రివెంజ్ ది రిసర్జెన్స్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ ది డెత్ ఆఫ్ స్టాటిస్ట్ సోషలిజం, భారతదేశ చరిత్ర మరియు రాజకీయాల యొక్క సమకాలీన పునర్విమర్శ అయిన ది రీడిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు ప్రసిద్దికెక్కినవి. 2022లో ‘రాజకీయ ఆర్థిక వ్యవస్థ దారిద్య్రం’ పేరుతో చివరి పుస్తకం రాశారు.

బాలీవుడ్ ఐకాన్ దిలీప్ కుమార్ పై కూడా ఒక పుస్తకం రాశారు. జీవితంలో ఎక్కువ భాగం లండన్‌లో నివసించినప్పటికీ, ఆయన భారతదేశంతో బలమైన సంబంధాలను కొనసాగించారు. ఆర్థిక, రాజకీయ చర్చల్లో తరచుగా పాల్గొనేవారు. ఆయన మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా నాయకులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన 38 సంవత్సరాలకు పైగా బోధించిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆయనను “తరతరాలుగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన మేధో దిగ్గజం” అని ప్రశంసించింది.

Leave a Comment