KCR Political Strategy: ఇదీ కేసీఆర్ స్కెచ్ లో భాగమే.?

KCR Political Strategy: సంకట స్థితిలో బహుముఖ వ్యూహం:

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్కెచ్ వేశాడంటే మహామహులు సైతం ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే.
తెలంగాణలో ఎప్పుడైనా
అన్ని పార్టీలకు టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నే. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి అన్ని పార్టీల నుంచి వస్తున్న విమర్శల శరపరంపర ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ బహుముఖ వ్యూహానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
శారీరకంగా ఒకవైపు సమస్యలు ఎదుర్కొంటున్నా, పార్టీని రక్షించుకునేందుకు కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఒకవైపు తెలంగాణ జాగృతి పేరుతో కవిత దూకుడు, మరోవైపు పార్టీ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు కొడుకు కేటీఆర్ ను, వీరిరువురి మధ్య సంధానకర్తగా పార్టీ నమ్మిన బంటు మేనల్లుడు హరీష్ రావు, అంతర్గత వ్యవహారాలు చూసుకునేందుకు సడ్డకుని కొడుకు సంతోష్ రావు తో పాటు తనకు అత్యంత అనుంగు సహచరులను ముందువరుసలో ఉంచి కార్యోన్ముఖులను చేసేందుకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల్లో సైతం ప్రధాన భూమిక నిర్వర్తిస్తూనే, కేసీఆర్ గురించి పల్లెత్తు మాట అనకుండా, పార్టీలో కిందిస్తాయి నాయకులపై ఎక్కువగా విమర్శలు గుప్పించే వారు కూడా ఆయన వ్యూహంలో భాగస్వాములేనని గమనించాలి. ఒకే పార్టీలో ఉండి కలిసి పోరాటం చేసే కన్నా, వేర్వేరుగా ఉంటూ శత్రువుపై వివిధ రూపాల్లో దాడి చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే విధానాన్ని కేసీఆర్ అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించుకున్న సమయంలో కొన్ని విషయాలు ఆయన దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత కొంతమంది వ్యక్తిగత, పార్టీ అభిమానులను దూరం చేసుకున్నట్లు గ్రహించినట్లు తెలుస్తోంది. ఉద్యమం సమయంలో కేసీఆర్ కు వెనుదన్నుగా నిలిచిన మేధావి వర్గం ఏ కారణాల వల్లనో దూరమయ్యారు. తిరిగి వారిని సమీకరించే పనిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. జాగృతి సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలని చెప్పిన కేసీఆర్, తిరిగి ఆ కార్యకలాపాల విషయంలో కవిత చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం లేదు. కేవలం ప్రధాన పార్టీ కార్యకలాపాలతోనే కాకుండా పార్టీకి దూరంగా ఉండేవారి మద్దతు కూడగట్టుకోవాలనే ఆలోచనతోనే అనుసంధానంగా జాగృతి గురించి ఆయన సీరియస్ గా లేడని తెలుస్తోంది.

Also Read: ‘జర్నలిస్టు’కు డెఫినేషన్ ఇచ్చిన సీఎం రేవంత్

పార్టీ ఓడిన తరువాత ఏమైంది
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూసిన తరువాత ఫామ్ హౌస్ నుంచి ఒంటి చేత్తో రాజకీయ చక్రం తిప్పుతున్న కేసీఆర్ తాను పురుడుపోసిన పార్టీనీ ఈ విధంగా రక్షించుకోవాలని విషయంలో అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీలో పరిస్థితి. చంద్రబాబుతో తెగతెంపులు చేసుకొని తెలంగాణ అస్తిత్వం కోసం సమరశంఖం పూరించి, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక నిర్వహించిన కేసీఆర్ సమయానికి అనుగుణంగా తన వ్యూహాలు మారుస్తూ రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెట్టిన వేసుకున్నారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలో పార్టీలో నివురుగప్పిన నిప్పులా రగిలేందుకు సిద్ధంగా ఉన్న ఆధిపత్య పోరును ముందే గ్రహించి, నీళ్ళు చల్లుకుంటూ వచ్చారు. కానీ పార్టీలో విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారం కోల్పోయిన తరువాత ఇంకా తేటతెల్లమయ్యాయి. ఆ సమయంలో దెబ్బమీద, దెబ్బ తగిలిన అవేమీ లెక్క చేయకుండా పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలనే విషయంలో కేసీఆర్ అంతర్మథనంలో పడ్డారు. తనకు రాజకీయంగా కూడా అత్యంత సన్నిహితంగా మెలిగిన కన్న కూతురు కవిత లిక్కర్ కేసులో జైలు పాలుకావడం, పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడడం, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీ అస్తిత్వానికి ప్రమాదం అవుతుందని తెలిసినా ఎక్కడా ఎవరికి తలొగ్గకుండా వ్యవహరించడం గమనార్హం. ఆ పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీకి దాసోహం అంటారని, పార్టీని బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని ఎవరికి వారే ఊహించుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన భవిష్యత్ కార్యాచరణపై మాత్రమే దృష్టిసారించారు. ఎక్కడ, ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకుండా సమయం కోసం వేచి చూశారు.
వేరు కుంపట్లు పెడతారా..?
తెలంగాణ జాగృతి నేత, ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులు చేసుకుంటారా, వేర్వేరు కుంపట్లు పెట్టుకుంటారు కావచ్చు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుందని ఎవరికివారే ఊహిస్తూ విశ్లేషిస్తున్నారు. కానీ ఇదంతా కేసీఆర్ బహుముఖ వ్యూహంలో భాగమేనని సమయమే నిర్ధారిస్తుంది. ఈనెల 8న కరీంనగర్లో బిఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అయితే కవిత కూడా 72 గంటల దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కథ క్లైమాక్స్ కు చేరిందని, రెండుగా పార్టీ చీలిపోతుందని, ఇద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయని ఇక పార్టీ విభజన తప్పదని అనుకుంటున్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు తారుమారు చేసే విధంగా కేసీఆర్ వ్యూహరచన ఉంటుందని తెలుసుకుంటారు.

Leave a Comment