Visakhapatnam Driving license cancellation: విశాఖలో 53 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు!

Visakhapatnam Driving license cancellation: విశాఖలో( Visakhapatnam) పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాలో దాదాపు 12 లక్షల బైకులు ఉంటే.. హెల్మెట్ లేకుండా బండి నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో పోలీసులు కట్టిన చర్యలకు దిగుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు తనిఖీల్లో పట్టుబడిన 53 వేల మందికి పైగా ద్విచక్ర వాహనదారుల లైసెన్సులు రద్దయ్యాయి. ముఖ్యంగా విశాఖ నగరంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసి మరి కేసులు నమోదు చేస్తున్నారు. వారి లైసెన్సులు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసులు చేస్తున్నారు. దీంతో విశాఖ నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

 పెరిగిన జరిమానాలు..

 హెల్మెట్( helmet) లేని వారి విషయంలో జరిమానాలు భారీగా పెరిగాయి. గతంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి 100 రూపాయలు జరిమానా విధించేవారు. ఇప్పుడు దానిని రూ.1,035 పెంచారు. అయితే ఒక్క జరిమానాతో విడిచి పెట్టే అవకాశం లేదు. లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు. హెల్మెట్ లేకపోతే లైసెన్స్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించడంతో ఈ కొత్త రూల్ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 1.39 లక్షల మంది లైసెన్సులను రద్దు చేయాలని ప్రతిపాదిస్తే.. 53 వేల లైసెన్సులు రద్దయ్యాయి. ఇక మున్ముందు మరింతగా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో లైసెన్స్ రద్దు అయిన 27 మంది మళ్ళీ పట్టుబడ్డారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

 ప్రమాదాలు జరుగుతుండడంతో..

 సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు. మరోసారి దొరికితే మూడు నెలల లైసెన్స్( licence) రద్దు అవుతుంది. ఆ తరువాత దొరికితే ఏకంగా ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. అటు తరువాత కూడా నిర్లక్ష్యం చేసి హెల్మెట్ ధరించకపోతే కోర్టు ఆదేశాల మేరకు శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. లైసెన్స్ రద్దు చేసిన సమయంలో వాహనం కనుక నడిపితే 5000 జరిమానా తో పాటు అదనంగా మరో మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు. అందుకే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ నగరానికి సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు లైసెన్స్ రద్దు ప్రతిపాదనలు రవాణా శాఖకు వెళ్తున్నాయి. లైసెన్స్ రద్దు చేసిన మరుక్షణం వాహనదారుల ఫోన్లకు సమాచారం వస్తోంది. విశాఖలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే పోలీసులు సీరియస్ గా తీసుకొని.. తనిఖీలు చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే విశాఖ నగరంలో పోలీసులు వాహనదారులను వెంటాడుతున్న తీరు మాత్రం చర్చకు దారితీస్తోంది.

Leave a Comment