రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ఫలితంగా జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడో, రష్యాలోని కురిల్ దీవులపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. ఈ సంఘటనతో జపనీస్ మంగా కళాకారిణి రియో టాట్సుకి 1999లో చేసిన అంచనా నిజమైందని అంతా భావిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు రియో టాట్సుకి జోస్యం నిజమైందని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. టాట్సుకి మాంగా “ది ఫ్యూచర్ ఐ సా” ప్రకారం.. 2025 జూలై 5న దక్షిణ జపాన్‌లో ఒక పెద్ద విపత్తు సంభవిస్తుందనే అంచనా ఉంది.
అయితే అందులో ఊహించినట్లు విపత్తు జూలై 5న సంభవించకపోయినా రియో టాట్సుకి చెప్పినట్లు కొన్ని రోజుల తేడాతో అయినా నిజమైందని అంటున్నారు. దీంతో రియో టాట్సుకి అంచనాలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె అంచనా చుట్టూ ఆన్‌లైన్‌లో, ముఖ్యంగా జపనీస్ సోషల్ మీడియాలో #July5Disaster వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రచారం జోరుగా సాగుతోంది. టాట్సుకి జోస్యం జూన్ చివరి నుండి జూలై ప్రారంభం వరకు హాంకాంగ్ నుండి జపాన్‌కు విమాన బుకింగ్‌లలో 83 శాతం తగ్గుదలకు దారితీసింది. ఇది గణనీయమైన ప్రజా ఆందోళనను సూచిస్తుంది.
అయితే టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సెకియా నవోయా వంటి నిపుణులు భూకంపాలను కచ్చితంగా అంచనా వేయలేమని నొక్కి చెబుతూ అలాంటి అంచనాలను అశాస్త్రీయంగా తోసిపుచ్చారు. అంతకుముందు జపాన్ అధికారులు కూడా ఆమె అంచనాలను విస్మరించాలని ప్రజలను కోరారు. అవి పూర్తిగా ఆధారం లేనివని, ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదని పేర్కొన్నారు. టాట్సుకి 2011 తోహోకు భూకంపం వంటి కచ్చితమైన అంచనాల చరిత్రను కలిగి ఉన్నప్పటికీ, బాబా వంగా ప్రవచనాలపై విమర్శల మాదిరిగానే ఇవి అస్పష్టంగా లేదా యాదృచ్చికంగా జరిగాయని సంశయవాదులు వాదిస్తున్నారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా కూడా భవిష్యత్తు గురించి అంచనాలు వేయడంలో ప్రసిద్ధి చెందారు. జపాన్‌కు చెందిన కార్టూన్ క్యారెక్టర్ రియో టాట్సుకిని చాలా మంది న్యూ బాబా వంగాగా, జపనీస్ బాబా వంగాగా అభివర్ణిస్తుంటారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి