ఎడారి దేశంలో అత్యధికంగా పండే పంట ఖర్జూరాలు. వీటిల్లో చాలా రకాలున్నాయి. అయితే సౌదీ అరేబియాలో పండే ప్రీమియం డేట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు అర్జించేది. అయితే ఇప్పుడు ఆ దేశం సరికొత్త ఆలోచనతో ఖర్జురాలను విభిన్న రూపంలో మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. దీంతో ఇప్పుడు యావత్ ప్రపంచం సౌదీ వైపు దృష్టి సారించింది.
ప్రపంచ మార్కెట్ లో బేవరేజెస్ విభాగంలో తనకంటూ బ్రాండ్ సృష్టించుకునేందుకు సౌదీ అరేబియా సరికొత్త ప్రణాళికలతో త్వరలో రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఖర్జూరాలతో ఒక సాఫ్ట్ డ్రింక్ ని తయారు చేసింది. మొదటి సారిగా మిలాఫ్ కోలా అనే బ్రాండ్ సృష్టించింది. ఇది సోడా పరిశ్రమను కదిలించవచ్చు. ఈ సాఫ్ట్ డ్రింక్ ని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన తురత్ అల్-మదీనా రూపొందించింది.. ఈ సంస్థకు సౌదీ అరేబియా అనేక రాయితీలు కల్పించింది. ఇటీవల రియాజ్ డేట్ ఫెస్టివల్ లో మిలాఫ్ కోలాను ఆవిష్కరించింది. అధికారికంగా అరంగేట్రం చేసింది. ఇప్పటికే ప్రపంచ పానీయాల రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇవి కూడా చదవండి
మిలాఫ్ కోలా స్పెషాలిటీ ఏమిటంటే
మిలాఫ్ కోలా తయారీలో చక్కెరని ఉపయోగించరు. కృత్రిమ పదార్థాలను వినియోగించరు. కేవలం ఖర్జురాలను మాత్రమే ఉపయోగించి తయారు చేస్తారు. దీంతో ఖర్జూరంలోని సహజమైన తీపి, పోషకాలు ఈ డ్రింక్ తాగడం వలన శరీరానికి లభిస్తాయని.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. అంతేకాదు శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని తయారీదారులు చెబుతున్నారు.. ఈ సాఫ్ట్ డ్రింక్ ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశామని.. కేవలం ప్రీమియం డేట్స్ మాత్రమే ఉపయోగించి ఈ సాఫ్ట్ డ్రింక్ ని తయారు చేస్తామని చెప్పారు. వాస్తవానికి ఈ డ్రింక్ ను 2030 నాటికి మార్కెట్ లోకి తీసుకురావాలని సౌదీ అరేబియా భావించింది. అయితే ప్రభుత్వం చూపిన చొరవ ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే ఐదేళ్లకు ముందే మార్కెట్లోకి వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న శీతల పానీయాలు పెప్సీ, కోకా-కోలా వంటివి కృత్రిమ రసాయనాలతో తయారు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఖర్జూరాలతో తయారు చేస్తున్న ఈ సాఫ్ట్ డ్రింక్ మిలాఫ్ కోలా.. పెప్సీ, కోకా-కోలా వంటి దిగ్గజ కంపెనీను దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా సవాలు చేస్తుందని.. తమ దేశం ప్రాశస్త్యం మరింత పెరుగుతుందని సౌదీ అరేబియా భావిస్తోంది. సాఫ్ట్ డ్రింక్ విభాగంలో అద్భుతమైన పేరు తీసుకొస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లో కూల్ డ్రింక్స్ అంటే కోకో కోలా, పెప్సికో అనే స్టేజ్ లో ఉన్నాయి. వేలకోట్ల బిజినెస్ చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో కొత్త శీతల పానీయం మిలాఫ్ కోలా ఎలా ఆకట్టుకుంటుంది? చక్కర వినియోన్ని తగ్గిస్తున్న నేపధ్యంలో మార్కెట్ లోకి అడుగు పెట్టే మిలాఫ్ కోలాకి ఏ స్థాయిలో ఆదరణ దక్కుతుందో చూడాలి మరి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..