Site icon Desha Disha

India Dead Economy: భారత్ నిజంగా ‘డెడ్ ఎకానమీ’నా?

India Dead Economy: భారత్ నిజంగా ‘డెడ్ ఎకానమీ’నా?

India Dead Economy: ఈ ట్రంప్ నాలుక ఎప్పుడు మడతెట్టేస్తాడో ఎవరికీ తెలియదు.. ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా తప్ప ఇతర ఏ దేశంపైన అయినా తన నోటిదూల వ్యక్తం చేస్తుంటాడు. తాజాగా భారత్ పైనే అదే అసహనాన్ని వెళ్లగక్కాడు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేరుపొందిన భారతదేశాన్ని “డెడ్ ఎకానమీ” అని ఆయన వ్యాఖ్యానించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నిజానిజాలు, అలాగే వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు విశ్లేషిద్దాం.

Also Read:  బీమార్‌ రాష్ట్రాలు.. పురోగతి లేని ప్రగతి.. ఇప్పటికీ వలసలే!

ట్రంప్ వ్యాఖ్యల వెనుక రాజకీయాలు

ట్రంప్ తరచుగా అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలపై కఠినమైన వైఖరిని అవలంబిస్తుంటారు. అమెరికాకు భారతదేశం నుంచి దిగుమతులు పెరగడం, అలాగే వలస విధానాలు వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం కొత్తేమీ కాదు. “డెడ్ ఎకానమీ” అనే పదం కేవలం ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చేసి ఉండవచ్చు. దీని ద్వారా అమెరికాలో తన మద్దతుదారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు, భారత్‌పై వాణిజ్యపరంగా ఒత్తిడి తీసుకురావాలనేది ఆయన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితి

ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా పలు అంతర్జాతీయ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూలమైన నివేదికలను వెలువరించాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF), ప్రపంచ బ్యాంక్ వంటివి భారతదేశాన్ని 2024-25 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అంచనా వేశాయి. వృద్ధి రేటు 6.5% పైగా ఉండొచ్చని వాటి నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని కొన్ని కీలక రంగాలు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. ఐటీ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి సేవల రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. “మేక్ ఇన్ ఇండియా” వంటి పథకాల వల్ల ఈ రంగం ఊపందుకుంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి వాటి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. యూపీఐ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ వంటివి భారత్‌ను ప్రపంచంలోనే డిజిటల్ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.

భారత ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. భారతదేశంలో ఉన్న యువ జనాభా, పెరుగుతున్న మధ్యతరగతి వినియోగ శక్తి దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి.

Also Read: ఇండియాతో కటీఫ్.. పాకిస్తాన్ తో దోస్తీ.. దెబ్బకొట్టిన ట్రంప్.. కారణం ఇదే

భారత్ – డెడ్ ఎకానమీ కాదు, రైజింగ్ ఎకానమీ

ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవే తప్ప, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని స్పష్టమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, బలమైన పునాదులపై నిలబడి వేగంగా ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లలో భారత్ స్థానం మెరుగుపడటం దీనికి నిదర్శనం. డెడ్ ఎకానమీ కాదు, భారత్ ఒక రైజింగ్ ఎకానమీగా ప్రపంచ పటంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది.

Exit mobile version