Hyderabad Real Estate: తెలంగాణలో రియల్ వ్యాపారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఊపందుకుంది. జిల్లాల పునర్విభజన, అభివృద్ధి, సాగునీటి వనరుల కారణంగా మారుమూల గ్రామాల్లో కూడా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైడ్రా ఏర్పాటుతో భూముల అమ్మకాలు పడిపోయాయి. మరోవైపు ధరలు మధ్య తరగతికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో క్రయ విక్రయాలు పడిపోయాయి. అయితే నిపుణులు మాత్ర.. రియల్ వ్యాపారం మిడిల్ క్లాస్‌కు అందుబాటులో ఉంటేనే వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారు. సంపన్నులను దృష్టిలో పెట్టుకుని చేసే వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగదని పేర్కొంటున్నారు.
Also Read: పెళ్లి కాకుండానే ఆడ – మగ కలిసే ఉండవచ్చు.. ఇదేం కల్చర్ రా నాయనా!
ప్రస్తుతం ఒడిదుడుకులు..
దేశంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం ఒడిదుడుకులు, అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. అనుకూల వడ్డీ రేట్లు, మార్కెట్లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఊహించిన స్థాయిలో డిమాండ్ పెరగడం లేదు. ఈ సమస్యల వెనుక మధ్యతరగతి వర్గాలు గృహల కొనుగోలుకు ముందుకు రాకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మధ్యతరగతి వర్గాలు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే జనాభాలో వీరి సంఖ్య అత్యధికం. అయితే, ప్రస్తుతం వీరు గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత తగ్గడం, ఆర్థిక అనిశ్చితి కారణంగా హై–ఎండ్ ప్రాజెక్టులకు డిమాండ్ క్షీణిస్తోంది. అడ్వాన్స్ చెల్లించిన కొందరు కూడా బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారు. భూమి విలువలు, నిర్మాణ ఖర్చులు గణనీయంగా పెరగడంతో బిల్డర్లు మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఇళ్లను అందించలేకపోతున్నారు. మధ్యతరగతి వర్గాలు ఆర్థిక స్థిరత్వం కోసం జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు, ఇది గృహ కొనుగోళ్లను వాయిదా వేయడానికి దారితీస్తోంది.
అందుబాటు ధరలతో పూర్వ వైభవం..
ప్రస్తుతం త్రిబుల్ బెడ్రూం ఇళ్లకు డిమాండ్ ఉంది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచేందుకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం అత్యంత అవసరం. తక్కువ ధరల గృహాలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకర్షిస్తాయి, ఇది మార్కెట్లో లావాదేవీలను పెంచుతుంది. గృహ కొనుగోళ్లు పెరగడం వల్ల సంబంధిత రంగాలైన నిర్మాణ సామగ్రి, బ్యాంకింగ్, రిటైల్ వంటి రంగాలు కూడా ఉత్తేజితమవుతాయి. అందుబాటు ధరల గృహాలు మార్కెట్‌ను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి, ఎందుకంటే ఈ వర్గం జనాభాలో అత్యధిక శాతాన్ని కలిగి ఉంది.
అడ్డంకులు ఇవే..
1. ఊహించని స్థాయిలో పెరిగిన భూమి ధరలు బిల్డర్లకు తక్కువ ధరల గృహాల నిర్మాణాన్ని అసాధ్యం చేస్తున్నాయి. ప్రభుత్వ వేలాల ద్వారా భూమి ధరలు మరింత పెరుగుతున్నాయి.
2. ముడి సరుకుల ధరల పెరుగుదల, కార్మిక ఖర్చులు, ఇతర లాజిస్టిక్ సమస్యలు నిర్మాణ వ్యయాలను పెంచుతున్నాయి.
3. ప్రస్తుత నిబంధనలు బిల్డర్లకు తక్కువ ధరల గృహాల నిర్మాణానికి సరైన ప్రోత్సాహకాలను అందించడం లేదు.
Also Read: వదిలేదేలే.. టీచర్లకు చుక్కలు చూపిస్తున్న రేవంత్ సర్కార్
ఇలా చేస్తే మరింత ఊపు..
రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలి. మధ్యతరగతి గృహాల నిర్మాణం కోసం సబ్సిడీ రేట్లలో భూమిని కేటాయించడం. ఇది నిర్మాణ ఖర్చులను తగ్గించి, గృహ ధరలను అందుబాటులో ఉంచుతుంది. అందుబాటు ధరల గృహ ప్రాజెక్టులకు ప్రత్యేక నిబంధనలు, టాక్స్ రాయితీలు, వడ్డీ సబ్సిడీలు అందించడం. అందుబాటు గృహాల నిర్మాణంలో ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయడం. తదితర చర్యలు ప్రభుత్వానికి నష్టం కలిగించవు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా పన్నులు, ఇతర రుసుముల రూపంలో ఆదాయం పెరుగుతుంది.