American Airlines Denver to Miami: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత అమెరికా తయారీ ‘బోయింగ్’ విమానాలపై ఎన్నో అనుమానాలు వ్యాపించాయి. దానికి తగ్గట్టుగానే వరుసగా విమాన ప్రమాదాలు జరగడంతో విమాన భద్రతపై సందేహాలు వెల్లువెత్తాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను విమానం ఎక్కడానికే భయపడేలా చేస్తున్నాయి.. తాజాగా మరో విమాన ప్రమాదం జరగడంతో ఈ భయాలు ఎక్కువయ్యాయి..
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గురువారం ఒక విమానానికి భారీప్రమాదం తృటిలో తప్పింది. విమానం ఇంజిన్ లో అగ్నిప్రమాదం సంభవించి కలకలం రేపింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ ప్రయాణికుల విమానంలో టేకాఫ్ తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఫైట్ ను తక్షణమే గ్రౌండ్ చేసేందుకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. సకాలంలో తీసుకున్న చర్యల వల్ల భారీ ప్రమాదం తప్పింది..
అమెరికా ఎయిర్ లైన్స్ కు చెందిన ఫైట్ 1958 విమానం డెన్వర్ నుంచి డల్లాస్ కు బయలు దేరిన వెంటనే ప్రయాణికులు సిబ్బందికి విమానం ఇంజిన్ భాగం నుంచి పొగలు, మంటలు కనిపించాయి. దీంతో వారు వెంటనే అప్రమత్తమై పైలట్ కు సమాచారం అందించారు.విమానం సిబ్బంది తక్షణమే స్పందించి ఎమర్జెన్సీ ప్రొటో కాల్స్ ను అమలు చేశారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను అత్యవసర నిష్క్రమణ ద్వారాల ద్వారా బయటకు పంపించారు. మొత్తం 160 మందికి పైగా ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.