చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు.. అన్నదాత దుఃఖీభవ…

చంద్రబాబు ఎన్నికల వేళ రైతుకు రూ20 వేలు ఇస్తామన్నారన్న షర్మిల
ఇప్పుడు కేంద్రం నిధులతో ముడిపెడుతున్నారని విమర్శలు
రైతుకు నేరుగా రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ అని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అందరికీ కాదని, కొందరికేనని ఆరోపించారు. ఏపీలో 76.07 లక్షల మంది రైతులుంటే… చంద్రబాబు సర్కారు ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మందినే అని వెల్లడించారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా వేశారని షర్మిల మండిపడ్డారు. ఁఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తున్నారు… తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టారు… ఇప్పుడు సుఖీభవ పేరుతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో బాబు గారు ఊదరగొట్టారు. కానీ గెలిచాక నాలుక మడతేశారు… కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో ముడిపెట్టారు.

కేంద్రం ఇచ్చే రూ.6 వేలు పక్కనబెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరు ఇచ్చేది రూ.14 వేలు మాత్రమే. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేంద్ర పథకంతో రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారు. కేంద్రం నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నప్పుడు మీరు ఇచ్చినట్టు ఎలా చెప్పుకుంటారు అని నాడు ప్రశ్నించారు. రెండూ కలిసే ప్రశ్నే లేదన్నారు.

ఆనాడు అన్ని మాటలు చెప్పిన మీరు ఇప్పుడు కేంద్రం నిధులతో ఎందుకు లింక్ పెట్టారు? మీరు ఇస్తామని చెప్పిన రూ.20 వేలలో కేంద్రం వాటాను ఎందుకు కలిపారు? హామీలు ఇచ్చేముందు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదు? కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం దేశంలో ఉన్న రైతులందరికీ… ఏపీకి మాత్రమే కాదు కదా! దీనికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20 వేలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాంఁ అంటూ షర్మిల స్పష్టం చేశారు.

Leave a Comment