Site icon Desha Disha

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల – సెప్టెంబర్ 9న ఓటింగ్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల – సెప్టెంబర్ 9న ఓటింగ్

దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ స్థానం అయిన ఉప రాష్ట్రపతి (Vice President of India) పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.జగదీప్ ధన్కర్ అనూహ్యంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీని ప్రకటించింది. ఈ మేరకు పోలింగ్‌ను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు వెల్లడించింది.అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.ఓటింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు.ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ణయించారు.

ధన్కర్ రాజీనామా..
ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువును ఆగస్టు 25 వరకూ పెట్టారు.ఉపరాష్ట్రపతిగా కొనసాగుతున్న జగదీప్ ధన్కర్ తన పదవికి తాను రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఆయన పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నా, అనుకోకుండా తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలను చూపిస్తూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
రాష్ట్రపతి ఆ లేఖను ఆమోదించడంతో దేశ అత్యున్నత స్థానాల్లో ఒకటి ఖాళీ అయ్యింది.
ఈ పరిణామంతో కొత్త ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికవుతారనే చర్చ రాజకీయం వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది.

ఉపరాష్ట్రపతి రేసులో..
ఉపరాష్ట్రపతి పదవికి కొత్త వ్యక్తి ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చురుగ్గా చర్చ సాగుతోంది.
అధికార పార్టీ పలు ప్రముఖ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.అంతేకాదు,కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరు కూడా బలంగా ప్రచారంలో ఉంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) నేత హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

అలాగే రెండు లెఫ్టినెంట్ గవర్నర్లు – జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లేదా ఢిల్లీ ఎల్జీ వినై కుమార్ సక్సేనా – వీరిలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇక అనూహ్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పేరు కూడా ఈ రేసులో తెరపైకి వచ్చింది.
దీంతో ఉపరాష్ట్రపతి పదవిని ఎవరు అధిష్టించబోతున్నారు అన్న ప్రశ్న రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

Exit mobile version