Palantir AI Software: టెక్నాలజీ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రోజు వచ్చిన సాకేతిక పరిజ్ఞానం ఏడాది తిరగకుండానే పాతబడుతోంది. దానిని మించిన కొత్త ఆవిష్కరణ అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ఒక సాఫ్ట్వ్ కంపెనీ తయారు చేసిన పాలంటీర్ టెక్నాలజీస్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్ద ఎత్తున డేటా విశ్లేషణ ద్వారా ప్రభుత్వ. ప్రైవేట్ రంగాలలో కీలక నిర్ణయాలను సులభతరం చేస్తోంది. 2003లో సీఐఏ మద్దతుతో స్థాపించబడిన ఈ సంస్థ, ఇంటెలిజెన్స్, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక రంగాలలో తన ప్రత్యేకమైన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లతో గణనీయమైన ప్రభావం చూపుతోంది.
Also Read: ప్రపంచ దేశాలకు ‘తువాలు’ హెచ్చరిక.
పాలంటీర్.. ఒక సాంకేతిక విప్లవం
పాలంటీర్ సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫామ్‌లు గోథమ్, ఫౌండ్రీ, అపోలో, ఏఐపీ విభిన్న రంగాలలో డేటా ఆధారిత నిర్ణయాలను సమర్థవంతంగా అందిస్తాయి. గోథమ్ జాతీయ భద్రత, ఇంటెలిజెన్స్ కోసం రూపొందగా, ఫౌండ్రీ ఆరోగ్యం, ఆర్థిక, తయారీ రంగాలలో వినియోగించబడుతుంది. అపోలో సాఫ్ట్వేర్ నిర్వహణను సులభతరం చేస్తుంది. అయితే ఏఐపీ జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆధారంగా నిర్ణయాధికారులకు సమర్థవంతమైన సలహాలను అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు భారీ డేటా సెట్లను కలిపి, సమర్థవంతమైన విశ్లేషణ ద్వారా ఆధునిక సవాళ్లను పరిష్కరిస్తాయి.
అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర..
పాలంటీర్ అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలతో, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ)తో సహకారాన్ని కలిగి ఉంది. దాని ఇన్వెస్టిగేటివ్ కేస్ మేనేజ్మెంట్ (ఐసీఎం) ప్లాట్‌ఫామ్ క్రిమినల్ హిస్టరీ, ట్రావెల్ డేటా, ఎంట్రీ–ఎగ్జిట్ రికార్డులను విశ్లేషించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ విచారణలు, మానవ అక్రమ రవాణా కేసులను ట్రాక్ చేస్తుంది. ఇది జాతీయ భద్రతా ఏజెన్సీలకు కీలకమైన సాధనంగా మారింది. అయితే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్)వీసా లేదా గ్రీన్‌కార్డ్ అప్లికేషన్ల కోసం పాలంటీర్ను ఉపయోగించడం లేదు. ఈ సాంకేతిక శక్తి అమెరికా రక్షణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏఐ ఆధారిత నిర్ణయాలు..
పాలంటీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (ఏఐపీ)నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) ద్వారా అధికారులకు సులభమైన డేటా ఇంటరాక్షన్‌ను అందిస్తుంది. ఏఐ సలహాలు అందించినప్పటికీ, అంతిమ నిర్ణయం మానవుల చేతిలోనే ఉంటుంది. ఇది బాధ్యతాయుతమైన డెసిషన్–మేకింగ్‌ను నిర్ధారిస్తుంది. ఈ సామర్థ్యం పాలంటీర్ను ఇంటెలిజెన్స్, రక్షణ రంగాలలో అనివార్య సాధనంగా మార్చింది.
Also Read: ప్రపంచ నాయకుడిగా మోదీ.. రికార్డు స్థాయిలో ప్రజాదరణ!
గోప్యతా ఆందోళనలు
పాలంటీర్ శక్తివంతమైన డేటా విశ్లేషణ సామర్థ్యాలు సామాజిక, మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, మైనారిటీలు, వలసదారులపై అధిక సర్వేలాన్స్, ప్రభుత్వ ఉపయోగంలో పారదర్శకత లోపం వంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ డేటా ట్రాకింగ్ సామర్థ్యాలు, ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విచారణలలో, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ విమర్శలు పాలంటీర్ వినియోగంలో సమతుల్యత, బాధ్యతను గుర్తు చేస్తున్నాయి.