Site icon Desha Disha

Narendra Modi Parliament 2025: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

Narendra Modi Parliament 2025: ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

Narendra Modi Parliament 2025: నరేంద్ర మోడీ సూటిగా మాట్లాడుతారు. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతారు. అవసరమైతే లోతైన విషయాలను బయటకు తీసి.. గత పరిణామాలను ప్రజల ముందు ఉంచుతారు. తద్వారా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తారు. అయితే అలాంటి మోడీ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు.. మాట్లాడిన తీరు ప్రతిపక్షాలకు ఆయాచితమైన వరం లాగా మారిందని విశ్లేషకులు అంటున్నారు.

పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ పై చర్చ జరిగింది. ఈ చర్చలో పాకిస్తాన్ దేశాన్ని.. ప్రతిపక్షాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శించారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ దేశం యుద్ధంలో ఓడిపోయిందంటే కొంతమందికి బాధ కలుగుతుందని ప్రధాని ఆరోపించారు. దేశ ప్రజల ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు పాకిస్తాన్ దేశానికి వత్తాసు పలుకుతున్నారు అనే దిశగా సంకేతాలు ఇచ్చారు. కానీ నరేంద్ర మోడీ మాట్లాడిన తీరును చూస్తే వేరే విధంగా ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతోంది.

Also Read: తేజస్వి, చిరాగ్, ప్రశాంత్, సంతోష్ మరి బీజేపీ కి ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి చర్చ జరిగినప్పుడు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వేరువేరుగా కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. “యుద్ధాన్ని ఆపానని శ్వేత దేశం అధ్యక్షుడు చెబుతున్నారు. యుద్ధం ఎవరి ప్రమేయం వల్ల ఆపలేదని మీరు అంటున్నారు. అలాంటప్పుడు శ్వేత దేశ అధ్యక్షుడిని అబద్దాలకోరు అని చెప్పవచ్చు కదా. ఈ పార్లమెంట్ వేదిక ముందు మీరు ఆ ప్రకటన చేస్తే దేశ ప్రజలు సంతోషిస్తారు కదా. దేశ ప్రధాని ఎటువంటి షరతులకు లొంగలేదని భావిస్తారు కదా. పైగా ఇటువంటి బలమైన నేత ప్రధానమంత్రిగా ఉండడాన్ని గొప్పగా అనుకుంటారు కదా..” అని రాహుల్, ప్రియాంక వ్యాఖ్యానించారు.

వాస్తవానికి ప్రతిపక్షాలను విమర్శించడంలో.. పాకిస్తాన్ దేశాన్ని దుయ్యబట్టడంలో విజయవంతమైన ప్రధాని.. రాహుల్, ప్రియాంక అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. పైగా యుద్ధాన్ని మధ్యలో ఆపిన ప్రధానిగా ఆయన అపకీర్తి మూటకటుకున్నారు.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నరేంద్ర మోడీని మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.. ఇందిరా గాంధీ ధైర్యంలో 50 శాతం వంతు ఉంటే.. యుద్ధాన్ని నరేంద్ర మోడీ మధ్యలో ఆపే వారు కాదని పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని ప్రధాని.. ఉగ్రవాదం పై పోరులో చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ ను అడ్డుకోలేదని వ్యాఖ్యానించడం విశేషం.

Also Read: ఆపరేషన్ సిందూర్ పై చర్చలో కాంగ్రెస్ కు వ్యూహమేది?

శ్వేత దేశం ఉపాధ్యక్షుడు మే 9న తనకు ఫోన్ చేశారని.. పాకిస్తాన్ అతిపెద్ద దాడి చేస్తుందని హెచ్చరించారని.. ఒకవేళ అలాంటి దాడికి వారు దిగితే మా చర్య తీవ్రంగా ఉంటుందని చెప్పానని మోడీ వివరించారు.. రాహుల్ గాంధీ విమర్శించారని, ప్రియాంక గాంధీ ప్రశ్నించారని కాదు గాని.. ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రధాని ఒక క్లారిటీ ఇస్తే దేశ ప్రజలకు కూడా మరింత స్పష్టత వచ్చేది. ఈ విషయంలో ప్రధాని ఎందుకనో అసలు విషయం దాస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు..

Exit mobile version