Jagan vs Radhakrishna: వ్యవస్థలో ఉన్న తప్పులను.. వ్యవస్థను అడ్డుపెట్టుకొని తప్పులు చేసే వ్యక్తులను కచ్చితంగా పాత్రికేయం ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది. అవసరమైతే చర్నాకోల్ అందుకుని వీపు పగిలే విధంగా వాయిస్తుంది. అందుకే పాత్రికేయానికి అంత విలువ ఉంది. ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభంగా వెలుగొందుతోంది. అటువంటి వ్యవస్థలో ఉన్నవారు స్వచ్ఛమైన వారేనా? వారంతా శుద్ధ పూసలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టం. పాత్రికేయంలో ఉన్నవారు తమకింది నలుపుని పక్కనపెట్టి.. మిగతా వారి మరకలను ఎంచడమే పనిగా పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో ఆ ధోరణి మరింత ఎక్కువైపోయింది. ఎవరైనా ఈ తరహా పాత్రికేయులను ప్రశ్నిస్తే లేదా మీడియా సంస్థలను నిలదీస్తే పత్రిక స్వామ్యం, వాక్ స్వాతంత్రం అంటూ రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఈ ఉపోద్ఘాతాన్ని ఇక్కడ కాసేపు ఆపుదాం.
Also Read: రాజకీయాల్లోకి ‘నారా’ వారసుడు!
తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రికేయులలో వేమూరి రాధాకృష్ణ ముందు వరుసలోనే ఉంటారు. కొన్ని విషయాలను తన పత్రిక తన చానల్ ద్వారా ఓపెన్ గానే చెప్పేస్తుంటారు. ఆయన జర్నలిజం లో ఉన్న బ్యూటీ కూడా అదే. చంద్రబాబు, అమరావతి మినహ మిగతా అన్ని విషయాల్లో ఆర్కే కుండబద్దలు కొట్టేసినట్టు రాస్తుంటాడు. తన పత్రికలో ప్రతి ఆదివారం కొత్త పలుకు శీర్షికన సంపాదకీయం రాస్తూ ఉంటాడు. ప్రాంతీయ విషయాలను మొదలుపెడితే అంతర్జాతీయ పరిణామాల వరకు విశ్లేషిస్తూనే ఉంటాడు. తనకున్న సమాచారానికి కాస్త మసాలా జోడించి రక్తి కట్టించేలా చేస్తాడు. ఈ ఆదివారం కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిని మద్యం కుంభకోణంలో చెడుగుడు ఆడుకున్నాడు రాధాకృష్ణ. ఇందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ఎందుకనో ఈసారి తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదు. కేటీఆర్, రమేష్ మధ్య వాగ్వాదం జరుగుతుంటే రాధాకృష్ణ ఎందుకనో తన సంపాదకీయంలో ప్రస్తావించలేదు. అప్పటికే కొత్త పలుకు పేజీ పూర్తయిందా.. లేక రాధాకృష్ణకు అప్డేట్ లేదా అనేది తెలియదు.
జగన్ కు తలంటు పోసిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద పడ్డాడు వేమూరి రాధాకృష్ణ.. కన్నడ నటుడు దర్శన్ నుంచి మొదలు పెడితే గాలి జనార్దన్ రెడ్డి వరకు బెయిల్ ఎలా లభించింది? న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేశాయి? ఇటీవల ఓ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు ఎలా దొరికాయి? వీటన్నింటినీ రాధాకృష్ణ ప్రశ్నించాడు. దేశ చరిత్రలో ఏ పాత్రికేయుడు చేయని సాహసానికి ఒడిగట్టాడు. ఇది ఆయనను అభినందించే విషయం. ప్రశంసించాల్సిన విషయం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాధాకృష్ణ ఎటువంటి తప్పులు చేయలేదా.. జగన్ మద్యం వ్యవహారంలో రకరకాల నేరాలకు పాల్పడ్డాడని.. అడ్డగోలుగా సంపాదనకు అలవాటు పడ్డాడని రాసిన రాధాకృష్ణ..తన పత్రికలో క్షేత్రస్థాయిలో అంతా సవ్యంగా నడిపిస్తున్నారా? ఒక చిన్న పాత్రికేయుడి నుంచి ఇంత పెద్ద మీడియా టైకూన్ గా ఎదగడానికి రహస్యాన్ని కూడాబయటపెట్టాలి.
Also Read: డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు.. ఆ డ్రైవర్ ముందు చూపునకు హ్యాట్సాఫ్!
ఇక ప్రారంభంలో ఒక ఉపోద్ఘాతం గురించి చెప్పుకున్నాం కదా.. ఈ కథనం మొత్తం చదివిన తర్వాత ఆ ఉపోద్ఘాతం సరైనదే కదా.. పాత్రికేయాన్ని అడ్డం పెట్టుకొని.. సమాజాన్ని తామేదో ఉద్ధరిస్తున్నామని డబ్బా కొట్టుకుని.. గొప్పగా ఫీల్ అయిపోయే పాత్రికేయులు ఉన్నంతవరకు ఈ సమాజమే కాదు.. చివరికి ఏ సమాజమూ బాగుపడదు. కలుపు మొక్కలు విరివిగా పెరిగిన చోట పంట చేను ఎదగదు. ఎందుకంటే కలుపు మొక్క నేలకే కాదు.. చివరికి పర్యావరణానికి కూడా హానికరమే.