Annadata Sukhibhava Scheme: ఏపీలో( Andhra Pradesh) అన్నదాత సుఖీభవ పథకం పై కీలక అప్డేట్ వచ్చింది. పథకం ఎప్పుడు అమలు చేస్తారో క్యాబినెట్ మంత్రి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం అందించే పీఎం సమ్మాన్ నిధితో కలిపి రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందించనున్నారు. ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. అయితే మరణించిన రైతు కుటుంబాలు మ్యుటేషన్ ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రభుత్వం సూచించింది. సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించి సరిచేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. అయితే కేంద్రం పీఎం కిసాన్ కు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆగస్టు 2 లేదా 3 తేదీల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు నిర్ణయించింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా జమ కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
* ఆగస్టు 2న కేంద్రంతో కలిపి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు( kinjarapu acham Naidu) కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ నిధులను ఆగస్ట్ 2న విడుదల చేస్తామని ప్రకటించారు. అదే రోజు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.5000 జతచేస్తూ.. మొత్తం 7000 రూపాయలను అదే రోజు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి సాగు ప్రోత్సాహం కింద 20 వేల రూపాయలను అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం పిఎం కిసాన్ కింద ఏడాదికి మూడు విడతల్లో ఆరువేల రూపాయలను అందిస్తోంది. అదే మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద మిగతా 14 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. తొలి రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 5000 రూపాయల చొప్పున.. చివరి విడత రూ.4000 అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలి విడత నిధులు ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
* అర్హుల జాబితా సిద్ధం..
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాను కూడా సిద్ధం చేశారు అధికారులు. అయితే తాజాగా ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందడానికి కీలక సూచనలు చేసింది. ఎవరైనా రైతు మృతి చెంది.. అతడి కుటుంబ సభ్యులు న్యూట్రిషన్ చేయించుకుంటే వారికి అన్నదాత సుఖీభవ పథకం వల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు మండలాల్లో అధికారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అలాగే వెబ్ ల్యాండ్ లో రైతుల ఆధార్ సంఖ్య తప్పుగా ఉంటే అలాంటివారు రెవెన్యూ అధికారులను సంప్రదించి తప్పును సరి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు నమోదైన రైతు మృతి చెందితే.. దానిని మార్చకపోతే పథకం వర్తించదని తేల్చి చెప్పారు. అందుకే ఇటువంటి తప్పిదాలను సరి చేసుకునే వీలుగా మళ్లీ గడువు పెంచారు. వివిధ కారణాలతో జాబితాలో పేరు లేకుంటే వ్యవసాయ కేంద్రాల్లోని అధికారులతో మాట్లాడి సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకం పై ఫుల్ క్లారిటీ వచ్చినట్లు అయింది.