Y S Jagan visit Nellore: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) అధినేత జగన్ పర్యటనలు అంటేనే పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ఆయన పర్యటనకు రక్షణ కల్పించలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ఆయన నేతల పరామర్శకు వెళ్తూ బల ప్రదర్శనకు దిగుతున్నారు. రాష్ట్రంలో తన బలం తగ్గలేదని నిరూపిస్తున్నారు. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. అదే సమయంలో ఒక బాధ్యతాయుతమైన నేతగా ఆయన వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అధినేత పర్యటనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన సమీకరణ చేస్తున్నాయి. పోలీసు ఆంక్షలు అధిగమించి బల ప్రదర్శనకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. జగన్ రెంటపాళ్ల పర్యటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. చనిపోయిన ఓ మనిషి విగ్రహ ఆవిష్కరణకు వెళ్తూ.. మరో ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణమయ్యారంటూ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అవి రాజకీయ కోణంలో ఉండడంతో జగన్ సైతం పట్టించుకోవడం లేదు. కేసుల్లో ఇరుక్కున్న నేతల పరామర్శకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. నెల్లూరులో ఇద్దరు మాజీ మంత్రుల పరామర్శకు వెళ్ళనున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నారు.
Read Also: మల్లారెడ్డి సార్ లెక్కనే పాలమ్ముతోంది.. పాతికేళ్ల ఈ అమ్మాయి ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలుసా.
మాజీ మంత్రుల పరామర్శ..
ఈరోజు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని మూలఖత్ లో పరామర్శించేందుకు జగన్ సిద్ధపడుతున్నారు. అయితే జగన్ టూర్ కు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు పదిమంది రావాలని ఆంక్షలు పెట్టారు. కీలక నేతలకు నోటీసులు ఇచ్చి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా జగన్ పర్యటనకు భద్రత కల్పించడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది. జగన్ చేసేది పరామర్శలు అయినా.. బల ప్రదర్శనకు దిగుతున్నారన్నది బహిరంగ రహస్యం. అధికార పార్టీ తమ సమావేశాలను, సభలను పరిమిత సంఖ్యలో చేసుకుంటోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే పనిగా బలప్రదర్శన చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఒక వైపు రక్షణ కల్పించలేదని.. మరోవైపు ఏమైనా ఘటనలు జరిగితే శాంతిభద్రతలు అదుపు తప్పాయని చెప్పే ప్రయత్నం గా తెలుస్తోంది..
Read Also: వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..!
వైసీపీ నేతలకు నోటీసులు జారీ..
నెల్లూరు జిల్లా( Nellore district) వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులకు నోటీసులు జారీ అయ్యాయి. రాజాగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిలకు పోలీసులు నోటీసులు అందించారు. ఎట్టి పరిస్థితుల్లో జన సమీకరణ చేయవద్దని నిర్దేశించారు. అయితే ఈ అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పర్యటనలను అడ్డుకునే కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అడ్డంకులు ఎదురైనా జగన్ పర్యటనలో జనం కనిపిస్తారని.. పోలీస్ ఆంక్షలు ఏమి చేయలేవని తేల్చి చెబుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.