Pulivendula Politics: ఏపీలో( Andhra Pradesh) ఎన్నికల అనే మాట వినిపిస్తే చాలు పొలిటికల్ హీట్ ఉంటుంది. ఆ ఎన్నికలు.. ఈ ఎన్నికలు అన్న తేడా ఉండదు. వాటి ఫలితాలను ఆశించి రాష్ట్రంలో ప్రజల తీర్పుగా చూపించే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతుంటాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఇప్పుడు అలా లేదు. వాటిని కూడా సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పరిగణిస్తున్నారు ప్రజలు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా తీర్పు ఇస్తుంటారు. అయితే ఇదే ప్రజాభిప్రాయానికి కొలమానంగా భావించే రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారానికి వాటిని వాడుకుంటాయి. ఏపీలో ఇప్పుడు అటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో రెండు జడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆ రెండు స్థానాల కు ఎన్నికలు జరగనుండడం.. పోరు ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది.
Also Read: కింగ్డమ్’ మూవీ ట్విట్టర్ రివ్యూస్ వచ్చేశాయి..సినిమా ఎలా ఉందంటే!
* కడప జిల్లాలో తప్పిన పట్టు
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా దెబ్బతింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కడప జిల్లాలో సైతం ఉనికికి ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను.. అతి కష్టం మీద మూడు సీట్లను కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మిగతా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి కూటమి హవా చాటింది. అయితే కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఎలాగైనా నిలదుక్కుకొని టిడిపికి గట్టి సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోని పులివెందుల జడ్పిటిసి స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ జడ్పిటిసి అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యంగా మారింది. మరోవైపు ఒంటిమిట్ట జడ్పిటిసి గా ఉన్న అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఎన్నిక అనివార్యంగా మారింది.
* గట్టి వ్యూహంలో టిడిపి..
కడపలోనూ.. అందునా పులివెందులలో( pulivendula ) అంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియంది కాదు. కచ్చితంగా ఇక్కడ గెలిచేందుకు అధికార టిడిపి గట్టి వ్యూహమే పొందుతుంది. ఆపై అధికార పార్టీగా అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది. అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీలా తో ఉన్నాయి. ఇదే అదునుగా మంచి ప్రయత్నం చేస్తే కూటమికి అనుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఇరుపక్షాలు గట్టి అభ్యర్థులను బరిలో దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆగస్టు 12న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితం రానుంది.
* ఇప్పటికీ బలంగానే..
ఇప్పటికీ పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అందునా పులివెందుల అంటే వైయస్ కుటుంబానికి పెట్టని కోట. అటువంటి చోట ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరమే. అయితే కూటమి దూకుడుగా ఉన్నా.. పులివెందుల నియోజకవర్గంలో మాత్రం టిడిపిలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీకి అదే మైనస్ గా మారింది. అందుకే ఇక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించి మరింత దెబ్బ కొడతామని టిడిపి నేతలు బలంగా చెబుతున్నారు. కానీ అటువంటి ధైర్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించకపోవడం విశేషం.