Site icon Desha Disha

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: తెలంగాణ మొదటి స్థానం నుంచి నాలుగు కి పడిపోయింది

Per capita income India: భారతదేశంలో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం లెక్కలు వెల్లడించింది. అలాగే, గత పదేళ్లలో మన దేశంలో ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందో కూడా తెలిపింది. అయితే, ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేదు. కొన్ని రాష్ట్రాలు బాగా ముందున్నాయి.. మరికొన్ని వెనుకబడ్డాయి. అసలు తలసరి ఆదాయం అంటే ఏంటి? ఏ రాష్ట్రం ఎంత ముందుందో వివరంగా తెలుసుకుందాం. భారతదేశ సగటు తలసరి ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,14,710కి చేరింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రకటించారు. పదేళ్ల క్రితం అంటే 2014-15లో ఇది రూ.72,805 మాత్రమే. అంటే పదేళ్లలో రూ.41,905 పెరిగింది. అయితే, అన్ని రాష్ట్రాల్లో ఈ ఆదాయం ఒకేలా పెరగలేదు. ఆర్థికాభివృద్ధిలో తేడాలు, వివిధ రంగాల పనితీరు, ప్రభుత్వ విధానాల వల్ల ఈ మార్పులు ఉన్నాయని పంకజ్ చౌదరి వివరించారు.

Also Read: దేశంలో ఒక్కొక్కరిపై రూ.1.32 లక్షల అప్పు..

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన లెక్కల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయంలో కర్ణాటక ముందుంది. కర్ణాటకలో తలసరి ఆదాయం రూ.2,04,605. ఆ తర్వాత తమిళనాడు రూ.1,96,309తో రెండో స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలో ముందున్న టాప్ 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వరుసగా కర్ణాటక రూ.2,04,605, తమిళనాడు రూ.1,96,309, హర్యానా రూ.1,94,285, తెలంగాణ రూ.1,87,912, మహారాష్ట్ర రూ. 1,76,678, హిమాచల్ ప్రదేశ్ రూ.1,63,465, ఉత్తరాఖండ్ రూ.1,58,819, పుదుచ్చేరి రూ.1,55,533, ఆంధ్రప్రదేశ్ రూ.1,41,609, పంజాబ్ రూ.1,35,356లుగా ఉన్నాయి.

తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తమిళనాడు రెండో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించిందని చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలో పరిశ్రమలు, విద్య రంగాల్లో వచ్చిన అభివృద్ధి వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. డీఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020-21లో రూ.1.43 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2024-25 నాటికి రూ.1.96 లక్షలకు పెరిగిందని ఆయన వివరించారు. తమిళనాడు సగటు వృద్ధి రేటు గత నాలుగు సంవత్సరాల్లో 8.15శాతం ఉంది. ఇది అంతకు ముందు ఉన్న 4.42శాతం కంటే దాదాపు రెట్టింపు అని అన్నారు.

Also Read:  ఫామ్ హౌస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మంత్రాంగం.. ఏంటి కథ?

తలసరి ఆదాయంలో తెలంగాణ నాలుగో స్థానానికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు టాప్ 3లో నిలిచిన తెలంగాణ, ఇప్పుడు హర్యానా కంటే వెనుకబడి, కర్ణాటక, తమిళనాడుల కంటే గణనీయంగా వెనుకబడింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ మార్పులు, ఆర్థిక విధానాలు, వివిధ రంగాల పనితీరు ఈ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించి ఉండవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తగ్గుదలకు గల కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, తలసరి ఆదాయాన్ని తిరిగి పెంచేందుకు కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version