My Home Rameswar Rao meets Narendra Modi: ఇప్పటికిప్పుడు మై హోమ్ రామేశ్వరుడు, చిన జీయరుడు ప్రధానిని కలవాల్సిన అవసరం ఏమొచ్చిందో?

My Home Rameswar Rao meets Narendra Modi: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిజ్ఞల మాదిరిగా రేవంతుడు రెచ్చిపోవడం లేదు. మై హోమ్ మీద ఈగ కాదు కదా గాలి కూడా వాలనివ్వడం లేదు. అటు మై హోం రామేశ్వరుడి ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీవీ9 కూడా రేవంత్ ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నది. అటు కేసీఆర్ విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోంది. మొత్తంగా చూస్తే పరస్పర ప్రయోజనకారి అనే పాత్రను అద్భుతంగా పోషిస్తుంది. టీవీ9 ఇప్పుడు మై హోమ్, మేఘా చేతిలో ఉంది కాబట్టి.. రేవంత్ రెడ్డి మేఘా కు దండిగా కాంట్రాక్టులు ఇస్తున్నాడు కాబట్టి.. ఇప్పటికిప్పుడు టీవీ9 కు వచ్చిన నష్టం లేదు.. పైగా అదనపు లాభం. ఎందుకంటే కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు భారీగానే వెనుకేసుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి జమానా లోనూ అదే విధానం కొనసాగుతోంది. ఎటొచ్చీ మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కొడుకు రామూరావు, చిన జీయర్ స్వామి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఎందుకు కలిశారనేది అంతు చిక్కని ప్రశ్న.

Also Read: పేరూ లేదు.. ఊరూ లేదు..67,000 కోట్లు..అందులో మీవేవైనా ఉన్నాయా?

పైకి సమత మూర్తి మూడవ వార్షికోత్సవానికి రావాలని.. ఆ వేడుకను ముచ్చింతల్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని.. గతంలో సమతా మూర్తి విగ్రహావిష్కరణకు తమరు వచ్చారని.. ఈసారి కూడా రావాలని ప్రధానిని ఆహ్వానించమని జూపల్లి రామేశ్వరరావు, రామూ రావు చెబుతున్నప్పటికీ.. అంత చిక్కని కారణం మరొకటి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల కాలంలో మై హోమ్ భారీగానే ప్రాజెక్టులు చేపడుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. మై హోమ్ మాత్రం నానక్ రామ్ గూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇతర ప్రాంతాలలో భారీగా వెంచర్లు వేస్తోంది. బహుళ అంతస్తులు కూడా నిర్మిస్తోంది. ప్రభుత్వపరంగా మై హోమ్ గ్రూప్ కు వచ్చిన ఇబ్బంది లేదు. నష్టం అంతకన్నా లేదు. పైగా జూపల్లి నిర్మిస్తున్న పెద్దపెద్ద ప్రాజెక్టులకు క్షణాల్లోనే అనుమతులు వస్తున్నాయి..

గతంలో సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. దాని ఆవిష్కరణ కెసిఆర్ చేతుల మీదుగా నిర్వహించాలి అనుకున్నారు. కానీ అనుకోకుండా అప్పట్లో మై హోమ్ గ్రూప్ కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టాయని వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే జూపల్లి రామేశ్వరరావు, జీయర్ స్వామిని వెంటబెట్టుకొని నరేంద్ర మోడీని కలిశారు. సమతా మూర్తి విగ్రహావిష్కరణకు రావాలని కోరారు. వారు అడిగిందే ఆలస్యం నరేంద్ర మోడీ రెక్కలు కట్టుకొని హైదరాబాదులో వాలిపోయారు. పైగా అప్పట్లో తెలంగాణలో పాగావేయాలని కమలం నాయకులు మహా పట్టుదలతో ఉన్నారు. పైగా బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని రావటమే ఆలస్యం.. కెసిఆర్ క్యాంపు నుంచి భీకరమైన ప్రతిధ్వనులు వినిపించాయి. గులాబీ మీడియా నెగిటివ్ ప్రచారం జోరుగా చేసింది. అయినప్పటికీ జూపల్లి వెనుకడుగు వేయలేదు. వెనక్కి తగ్గలేదు.

Also Read : ఆ ప్రశ్నకు సమాధానం ఏది?.. మోడీ విపక్షాలకు దొరికిపోయారా?

ఇక అప్పటినుంచి జీయర్ స్వామి, కెసిఆర్ మధ్య చెడింది అంటారు. మై హోమ్ గ్రూప్ కూడా గులాబీ క్యాంపుకు దూరం జరిగింది అంటారు. ఆ దూరం ఇప్పటికి అలాగే ఉన్నప్పటికీ.. ఇప్పటికిప్పుడు కేసీఆర్ నుంచి వచ్చే ప్రతిఘటన కూడా లేకపోయినప్పటికీ మై హోమ్ రామేశ్వరరావు ప్రధానిని కలవడమే కాస్త ఆశ్చర్యం.. ఆ మధ్య కాషాయ కండువా కప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. దానిని ధ్రువీకరించే ఒక ఫోటో కూడా బయటపడలేదు. మరి ఇప్పుడు నేరుగా ప్రధానిని కలిసారు కాబట్టి మై హోమ్ రామేశ్వర రావు కాషాయ కండువాను కప్పుకోవడం ఖాయమేనా.. లేక ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయా.. రోజులు గడిస్తే గాని ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.

Leave a Comment