MLC Kavitha: రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎటువంటి సంచలనమైనా చోటు చేసుకోవచ్చు. ఎక్కడ కొడంగల్ లో పుట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు కదా.. కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఆయన.. అదే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని.. రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటాడని.. సోనియాగాంధీతో ప్రశంసలు పొందుతాడని కలలో కూడా ఊహించలేదు కదా. ఊహించనివి జరిగితేనే అద్భుతం అంటారు. అలాంటి అద్భుతాలు మన దేశ రాజకీయాలలో చాలానే చోటుచేసుకున్నాయి. అందువల్లే రాజకీయాలు సంచలనాలు, అద్భుతాల చుట్టూ తిరుగుతుంటాయి. మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. గొప్ప గొప్ప నేతలు తమ ఆస్తి లాగా తమ పిల్లలకు రాజకీయాలను వారసత్వంగా ఇస్తుంటారు. తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల కవిత.. స్వల్పకాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగకు తనదైన స్ట్రాటజీని జత చేసి.. తెలంగాణ బతుకమ్మకు గుర్తింపు తీసుకొచ్చారు.. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచిన ఆమె.. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
Also Read: ఓజీ ట్రైలర్ డేట్ ను లాక్ చేశారా..? రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్…
ఇటీవల కాలంలో కవిత రాజకీయ అడుగులను జాగ్రత్తగా పరిశీలిస్తే.. సొంత ప్రయాణం చేసే దిశగా కనిపిస్తున్నాయి.. ఆ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుంది.. ఈవైపు కు దారితీస్తుంది.. అనే ప్రశ్నలు పక్కన పెడితే.. తనదైన రాజకీయాన్ని కవిత చేస్తున్నారు. వర్తమాన అంశాలనే కాదు.. ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. తన తండ్రి పరిపాలించిన కాలంలో జరిగిన తప్పుల గురించి వివరిస్తున్నారు. ఆ తప్పులను సవరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. కవిత ప్రస్తుతం జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. గతంలో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.. ఈ సందర్భంగా “మీరు ఏదో ఒక సమయంలో ముఖ్యమంత్రి అవుతారు.. ముఖ్యమంత్రి అయితే ఏ నిర్ణయం తీసుకుంటారని” ఆ న్యూస్ ఛానల్ వ్యాఖ్యత ప్రశ్నించారు. దానికి కవిత ముందుగా ముసి ముసి నవ్వులు నవ్వారు. ఆ తర్వాత తనదైన స్పందన వ్యక్తం చేశారు. “నేను గనక ముఖ్యమంత్రి అయితే తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనది సంపూర్ణ మద్యపాన నిషేధమని” కవిత సమాధానం గా చెప్పారు. దీంతో అక్కడున్న మహిళలు మొత్తం చప్పట్లు కొట్టారు. ఎందుకంటే మద్యపానం వల్ల చాలామంది పురుషులు ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. తమ సంసారాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. చివరికి ప్రాణాలు వదులుతున్నారు. మద్యపానం నిషేధం అంటే ఒక రకంగా ఎంత మంది పురుషుల ఆరోగ్యాలను కాపాడినట్టు. అప్పట్లోనే కవిత ఆ ప్రకటన చేశారు కాబట్టి.. భవిష్యత్ కాలంలో ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆ హామీని నిలబెట్టుకుంటారని జాగృతి నేతలు అంటున్నారు.