Kiran Kumar Reddy Political Retirement: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy) రాజకీయాలకు గుడ్ బై చెబుతారా? ఇక విశ్రాంతి మేలన్న నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుదీర్ఘకాలం చిత్తూరు జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. అయితే అనూహ్యంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి వరించింది. కనీసం మంత్రి పదవి చేపట్టక పోయిన ఆయనకు.. ఏకంగా సీఎం పదవి లభించింది. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పాలనలో తనకంటూ ఒక మార్కు చూపించారు. అయితే రాష్ట్ర విభజన ఒకవైపు.. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు.. కిరణ్ నాయకత్వానికి గుర్తింపు లేకుండా చేసింది. అయితే దాదాపు 11 సంవత్సరాలు ఎటువంటి పదవులు చేపట్టలేదు. ఒక విధంగా రాజకీయాలతో గ్యాప్ వచ్చింది. ఇటువంటి సమయంలో పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించడమే మేలన్న నిర్ణయానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
* సుదీర్ఘ నేపథ్యం..
చిత్తూరు జిల్లాలో( Chittoor district) నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం. సుదీర్ఘకాలం నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయాలు చేశారు. 1987లో ఎమ్మెల్యేగా ఉంటూ మృతి చెందారు. దీంతో వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డి తల్లి సరోజినమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 1989 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1994లో మాత్రం ఓడిపోయారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పదవి నిర్వహించారు. 2009లో అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. అయితే రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోశయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేశారు రోశయ్య. అలా 2010 సెప్టెంబర్ 25న ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి. తన మార్కు పాలనతో మంచి ఫలితాలు సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనతో నామరూపాలు లేకుండా పోయింది. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఐదేళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో తిరిగి ప్రవేశించారు. కానీ అక్కడ ఉండలేక 2024 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు.
* ఇదే సరైన సమయమని..
మొన్నటి ఎన్నికల్లో రాజంపేట( rajampeta ) పార్లమెంట్ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా బిజెపి తరఫున పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓడిన నాటి నుంచి నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు. హైదరాబాద్ తో పాటు బెంగళూరుకె పరిమితం అవుతున్నారు. మొన్నటికి మొన్న రాజ్యసభ పదవిని ఆశించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని కూడా అంచనా వేసుకున్నారు. అయితే ఆ పదవులేవీ దక్కలేదు. అయితే రాజకీయంగా వచ్చిన గ్యాప్ కారణంగానే కిరణ్ కుమార్ వెనుకబడ్డారన్న టాక్ ఉంది. అయితే ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి వయసు 63. ఈ సమయంలో పొలిటికల్ గా రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.