CM Revanth Reddy Navatelangana News Paper: గతంలో ప్రజాశక్తిగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నవతెలంగాణగా మారింది. ప్రస్తుతం ఆపత్రిక దశాబ్ది నుంచి 11 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. పది సంవత్సరాల వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించింది. ఆగస్టు 1న అంటే రేపు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి ప్రాంతంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక యాజమాన్యం దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
Also Read: మాకు ఇప్పుడు విజయ్ దేవరకొండ నే పవన్ కళ్యాణ్ – నాగవంశీ
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర అతిధులుగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక, సిపిఎం పౌల్ట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, నవతెలంగాణ ఇన్చార్జి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతారని నవతెలంగాణ ప్రకటించింది. గతంలో పత్రికలు లేదా చానల్స్ ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రులను పిలిచేవారు. కానీ వార్షిక వేడుకలకు ఫస్ట్ టైం ఒక సీఎం హాజరవుతున్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలనుకుంటున్న సిపిఎం.. గతంలో కెసిఆర్ తో అంట కాగింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులను తన అవసరానికి వాడుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దూరం పెట్టారు. దీంతో సిపిఎం ఏకాకిగా మారిపోయింది. ఫలితంగా గడచిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.
అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సిపిఎం వచ్చే ఎన్నికల్లో అవకాశాలు పెట్టుకుంటున్నది. దీంతో తన పార్టీ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న నవతెలంగాణ పత్రిక పదేళ్ల పండుగకు ముఖ్యమంత్రిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తోంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి దూరం పెట్టడం.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేకపోవడంతో.. సిపిఎం కు శాసనసభ, శాసనమండలిలో అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నవ తెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డిని సిపిఎం నాయకులు ఆహ్వానించడం ఒకరకంగా రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.. నవతెలంగాణ పత్రిక పదవ వార్షికోత్సవానికి రేవంత్ రెడ్డిని ఆహ్వానించడం గొప్ప విషయం కాకపోయినప్పటికీ.. దాని వెనుక ఉన్నది మార్క్సిస్ట్ లీడర్ తమ్మినేని వీరభద్రం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పైగా రేవంత్ ను ముఖ్య అతథిగా ఆహ్వానించిన విషయాన్ని రాజకీయ కోణంలో పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు..
నవతెలంగాణ పత్రిక వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించడం వల్ల ప్రభుత్వానికి దగ్గర కావడానికి సిపిఎం ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇది సఫలీకృతమైతే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ – సిపిఎం మధ్య పొత్తు కుదురుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పొత్తు కుదురని పక్షంలో రేవంత్ ప్రభుత్వం ప్రకటనల భాగ్యం నవతెలంగాణకు దక్కొచ్చు. పదేళ్ల పండుగకు సంబంధించి నవతెలంగాణ భారీగా ముఖ్యమంత్రి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కూడా నవతెలంగాణ కు 10 సంవత్సరాల పండగకు సంబంధించి లేఖ ద్వారా ఒక సందేశాన్ని కూడా పంపారు.