Site icon Desha Disha

రూ.12 కోట్ల బంగారం వరదపాలు

రూ.12 కోట్ల బంగారం వరదపాలు

బీజింగ్‌: చైనాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల మెరుపు వరదలు సంభవించాయి. షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఓ నగల దుకాణం నుంచి బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో స్థానికులు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఉచి కౌంటీలో జులై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతం సముద్రతీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న లావోఫెంగ్జియాంగ్‌ ఆభరణాల దుకాణాన్ని ఎప్పటిలాగే సిబ్బంది ఉదయం తెరిచారు. అప్పటికే భారీ వర్షాలతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. చూస్తుండగానే వరద నీరు దుకాణంలోకి చొచ్చుకొచ్చింది. వరద ఉద్ధృతి పెరగడంతో కళ్లముందే దుకాణంలోని నగలు, సేఫ్‌ బాక్స్‌ కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాటిల్లో బంగారు హారాలు, గాజులు, ఉంగరాలు, చెవి దుద్దులు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు ఉన్నట్లు దుకాణ యజమాని తెలిపారు. సేఫ్‌ బాక్సులో రీసైకిల్‌ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, నగదు గల్లంతైనట్లు తెలిపారు. వీటి విలువ 10 మిలియన్‌ యువాన్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ.12 కోట్ల పైమాటే) ఉంటుందని వెల్లడిరచారు. బంగారం కొట్టుకుపోయిన విషయం తెలియగానే స్థానికులు పెద్దఎత్తున వీధుల్లోకి చేరి బంగారం కోసం వెతకడం ప్రారంభించారు. కొందరు స్వచ్ఛందంగా తమకు దొరికిన ఆభరణాలు వెనక్కి ఇచ్చేశారని దుకాణ యజమాని తెలిపారు. ఇప్పటివరకు కేజీ బంగారం తమ వద్దకు చేరిందన్నారు. రోజులు గడుస్తున్నా మిగతా బంగారం కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Exit mobile version