ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేసింది. తన భర్త పారుపల్లి కశ్యప్‌తో ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ క్రమంలో తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సైనా సోషల్ మీడియాలో వెల్లడించింది. జులై 13 ఆదివారం అర్ధరాత్రి సైనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వారిద్దరి దారులు ఇప్పుడు వేరయ్యాయి. సైనా, కశ్యప్ ప్రేమ కథ బ్యాడ్మింటన్ కోర్టులో మొదలైంది. వీరిద్దరూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో కలిసి శిక్షణ పొందారు. అక్కడి నుంచే వారి ప్రయాణం కూడా మొదలైంది.
సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విడాకుల విషయాన్ని తెలియజేశారు. ఆమె ఇలా రాసుకొచ్చారు కొన్నిసార్లు జీవితం మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచించిన తర్వాత నేను, పారుపల్లి కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం. మేము శాంతి, ఎదుగుదల, మానసిక ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాం. గత జ్ఞాపకాలకు నేను కృతజ్ఞురాలిని. కశ్యప్ తదుపరి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ సమయంలో మా గోప్యతను గౌరవించండి. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.. అంటూ సైనా ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.