కార్పొరేట్‌లకు మోదీ సర్కార్‌ ఊడిగం

. కమ్యూనిజాన్ని అంతం చేయలేరు
. సీపీఐ వరంగల్‌ జిల్లా మహా సభలో చాడ వెంకట్‌ రెడ్డి

విశాలాంధ్ర – హనుమకొండ : కార్పొరేట్‌ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్‌ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన సభకు సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అధ్యక్షత వహించగా చాడ వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. మోదీ పాలనలో అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. గడిచిన 11 ఏళ్లుగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ శక్తుల కనుసన్నల్లో ముందుకు సాగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్‌ శక్తులకు దాసోహం అయ్యారని మండిపడ్డారు. కార్పొరేట్‌ కంపెనీలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన వారు బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను తుంగలో తొక్కుతూ రచయితలను, కవులను, కళాకారులను, విద్యావేత్తలను అణచివేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలుపుతున్నారని అన్నారు. నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం నిరంతరం పెరుగుతూ పేదలకు విద్య, వైద్యం అందక ఆందోళనకు గురవుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తోందని, కమ్యూనిస్టులను అంతం చేయాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. మావోయిస్టులపై చేపట్టిన మారణకాండను నిలిపివేయాలని సీపీఐ మొదటి నుంచి పోరాడుతోందని తెలిపారు. కమ్యూనిస్టులను అంతం చేయలేరని, కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్ధాంతం అని చెప్పారు. కమ్యూనిస్టులు అన్ని దేశాలలో ఉన్నారన్న విషయం రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు గుర్తెరగాలని, అసలు కమ్యూనిస్టులకు బద్ద శత్రువే బీజేపీ అని అన్నారు. పేదలు, దోపిడీ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు ఉంటారని, వామపక్షాల దారులు వేరైనా గమ్యం ఒకటేనని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడుకునేందుకు వామపక్ష ప్రగతిశీల శక్తులు కలిసి ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలను ఆదుకోవాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరంతరం పేదల, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడే కమ్యూనిస్టులుగా తాము ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. రానున్న రోజులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలు : తకెళ్లపల్లి శ్రీనివాసరావు
వరంగల్‌ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ రాలేదని, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పనులు పూర్తి కాలేదని అన్నారు. వరంగల్‌ జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
వరంగల్‌ నగరంలో సీపీఐ భారీ ప్రదర్శన
సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా వరంగల్‌ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శివ నగర్‌లోని సీపీఐ కార్యాలయం తమ్మెర భవన్‌ నుంచి వరంగల్‌ చౌరస్తా మీదుగా పోచమ్మ మైదాన్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ ప్రదర్శన అనంతరం జరిగిన సభలో సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, రాష్ట్ర నాయకులు టి.వెంకట్రాములు, సిరబోయిన కరుణాకర్‌, పంజాల రమేష్‌, సయ్యద్‌ వలీ ఉల్లా ఖాద్రి, పల్లె నర్సింహ, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్‌.కె.బాష్‌ మియా, పనాస ప్రసాద్‌, నాయకులు గన్నారపు రమేష్‌, దండు లక్ష్మణ్‌, అక్కపెల్లి రమేష్‌, బుస్సా రవీందర్‌, తోట చంద్రకళ, సంగి ఎలేందర్‌, గుండె బద్రి, ఆరెళ్లి రవి, కె.చెన్నకేశవులు, జి.మునీశ్వర్‌, దామెర కృష్ణ, వి.శంకరయ్య, ఎండీ ఖాసీం, కుమారస్వామి, ఎండీ ఖాసీం, రాజు, అక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

The post కార్పొరేట్‌లకు మోదీ సర్కార్‌ ఊడిగం appeared first on Visalaandhra.

Leave a Comment