ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన రూ.కోట్లు విలువ చేసే బంగారం..

వెతికేందుకు ఎగబడ్డ జనం..
చైనా ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి. ఈ వరదలకు ఓ నగల దుకాణంలోని రూ.కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు కొట్టుకుపోయాయి . ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వెతికేందుకు ఎగబడ్డారు. షాంగ్జీ ప్రావిన్స్‌ లో ఈనెల 25న భారీ వర్షాలు కురిశాయి. వర్షానికి రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే, ఆ ప్రాంతంలో ఓ బంగారు ఆభరణాల దుకాణాన్ని ఉదయం తెరిచి ఉంచగా.. ఆ షాప్‌లోకి వరద ఒక్కసారిగా పోటెత్తింది. దుకాణంలోని బంగారు ఆభరణాలన్నీ కొట్టుకుపోయాయి. కళ్లముందే బంగారం కొట్టుకుపోవడంతో దుకాణం యజమాని గుండెలు బాదుకుంటున్నాడు. కొట్టుకుపోయిన వాటిలో హారాలు, ఉంగరాలు, గాజులు, చెవి కమ్మలు, వజ్రాల ఉంగరాలు, కొన్ని వెండి వస్తువులు ఉన్నట్లు దుకాణం యజమాని తెలిపారు. వీటితోపాటు సేల్స్‌ బాక్స్‌ కూడా పోయిందన్నారు. అందులో రీసైకిల్‌ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వరదలకు దాదాపు 20 కేజీల బంగారం కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి విలువ రూ.12 కోట్లకు పైమాటే అని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కొట్టుకుపోయిన బంగారం వెతికేందుకు ఎగబడ్డారు. వీధుల్లో బురద నీటిలో అనువణువూ వెతకడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Leave a Comment