Site icon Desha Disha

మరిన్ని సుంకాలు తప్పదు

మరిన్ని సుంకాలు తప్పదు

భారత్‌, రష్యాకు ట్రంప్‌ బెదిరింపు

వాషింగ్టన్‌: భారత్‌ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. తాజాగా రష్యా, భారత్‌లను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యాతో భారత్‌ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని గురువారం ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. కానీ, వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని తెలిపారు. తాము భారత్‌తో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామని, ఎందుకంటే అత్యధికంగా భారత్‌ సుంకాలు విధిస్తుందని ఆరోపించారు. రష్యా, అమెరికా కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్‌ వెల్లడిరచారు. తమతో వాషింగ్టన్‌ గేమ్‌ ఆడుతుందని, అది యుద్ధానికి దారితీయొచ్చని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మద్వెదేవ్‌ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఆయన ఇంకా అధ్యక్షుడిననే భ్రమలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దిమిత్రి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని హెచ్చరించారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్‌ సహా పలు దేశాలను ఇటీవల అమెరికా హెచ్చరించింది. ఇదే కారణాన్ని చూపుతూ భారత దిగుమతులపై 25 శాతం పన్నులతో పాటు పెనాల్టీలు కూడా విధించింది.
ఆరు భారత చమురు కంపెనీలపై ఆంక్షలు
భారత్‌కు చెందిన చమురు కంపెనీలపై ట్రంప్‌ సర్కార్‌ ఆంక్షలు విధించింది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌ చేస్తున్నారనే అభియోగాలపై ప్రపంచవ్యాప్తంగా 20 సంస్థలపై వైట్‌హౌస్‌ చర్యలు తీసుకుంది. ఇందులో భారత్‌కు చెందిన 6 కంపెనీలు ఉన్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. చమురు విక్రయాలతో నిధులు సమకూర్చుకొని మిడిల్‌ ఈస్ట్‌లో సంఘర్షణలు, అస్థిరతకు ఇరాన్‌ ఆజ్యం పోస్తుంది. సొంత దేశ ప్రజలతో పాటు ప్రపంచాన్ని అణచివేసేందుకు ఉగ్ర ముఠాలకు ఆర్థికంగా మద్దతు ఇస్తుంది. అందుకే తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు తీసుకుంది. ఇరాన్‌ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్‌ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వాములైన 20 కంపెనీలపై ఆంక్షలు అమలు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. అయితే, భారత్‌తో పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, టర్కీ, ఇండోనేషియా దేశాలకు చెందిన కంపెనీలపైనా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఇరాన్‌ చమురు, పెట్రోకెమికల్‌ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారు తమ ఆంక్షల ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగింది. అంతేగాక, తమతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారని అమెరికా హెచ్చరించింది.
పాక్‌తో చమురు ఒప్పందం
పాకిస్థాన్‌తో కలిసి చమురు నిల్వలు అభివృద్ధి చేయడానికి పనిచేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాకుండా పాకిస్థాన్‌ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మవచ్చని చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్‌తో మేము ఇప్పుడే ఒక ఒప్పందం చేసుకున్నాం. దీని ద్వారా పాకిస్థాన్‌, అమెరికా భారీ చమురు నిల్వలు అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తాయి.
ఈ భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని మేము ఎంచుకునే ప్రక్రియలో ఉన్నాము. బహుశా వారు ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

The post మరిన్ని సుంకాలు తప్పదు appeared first on Visalaandhra.

Exit mobile version