Quartz Mining Scam Case: అసలు నెల్లూరు జిల్లాలో( Nellore district) ఏమవుతోంది? క్వార్జ్ మైనింగ్ కుంభకోణంలో కీలకపాత్ర ఎవరిది? అసలు ఈ పాపం ఏ పార్టీది? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రధానంగా నెల్లూరులో జరిగిన ఈ కుంభకోణం మీడియాలో సైతం చర్చనీయాంసంగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో కథనం వస్తూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ సుదీర్ఘ చరిత్ర ఉన్న పత్రికలో దీనిపై కథనం వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేత ఉన్నారని.. ఆయనే ఈ దందాకు పాల్పడుతున్నారని.. వైసిపి హయాంలో తప్పులకు ఓ మాజీమంత్రి ఇప్పటికే మూల్యం చెల్లించుకున్నారని.. అయినా సరే ఆ టిడిపి కీలక నేత అదే ధోరణి కొనసాగిస్తున్నారని ఆ పురాతన పత్రికలో ఒక కథనం వచ్చింది. అయితే దీనిపై వివరణ ఇవ్వాల్సిన టిడిపి నేతలు నేరుగా ఆ పత్రిక కార్యాలయానికి వెళ్లి.. ఏకంగా ఎడిటర్ను దుర్భాషలాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తప్పు చేయకుంటే నేరుగా ఖండిస్తే సరిపోయేదని… అలా ప్రవర్తించడం ఏమిటనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.
తప్పుల ఎత్తిచూపు..
క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి( Govardhan Reddy) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వైసిపి హయాంలో భారీ కుంభకోణం జరిగిందని టిడిపి మీడియా ఆరోపిస్తోంది. అయితే ఇదే వ్యాపారంలో ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటి వైసిపి నేతలే ఇప్పుడు టిడిపి నేతలుగా చలామణి అవుతున్నారని.. అప్పటి తప్పే ఇప్పుడు కొనసాగుతోందని నెల్లూరుకు చెందిన జమీన్ రైతు అనే వారపత్రికలో ప్రత్యేక కథనం వచ్చింది. అయితే ఈ మైనింగ్ కు సంబంధించి.. వారి యాజమాన్యాల వద్ద రాజకీయ మామ్మూళ్లు వసూలు చేస్తున్నారని.. దీని వెనుక ఎంపీ ప్రభాకర్ రెడ్డి హస్తం ఉందని ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి గణాంకాలు, కేస్ స్టడీస్ లేవు. అయితే ఈ కథనంపై వేమిరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత కథనం అంటూ మండిపడుతున్నారు. ఏకంగా సంబంధిత పత్రిక కార్యాలయానికి వెళ్లి.. ఎడిటర్ డోలెంద్ర ప్రసాద్ ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు ఖండించి.. వాస్తవాలు చెప్పాలి కానీ ఇలా మాట్లాడడం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న.
బలమైన నేతగా వేమిరెడ్డి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో బలమైన నేతగా ఉండేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పారిశ్రామికవేత్తగా అనేక రకాల వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి. ఈ క్రమంలో క్వార్జ్ మైనింగ్లో కూడా ఆయనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. అయితే ఆ మైనింగ్ కు సంబంధించి పూర్తి సహకారం అందిస్తేనే తెలుగుదేశం పార్టీలోకి వస్తానని ఈ ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ఒప్పందం చేసుకున్నారన్నది ఈ కథనం సారాంశం. అయితే వేమిరెడ్డి టిడిపిలోకి వస్తూ వస్తూ బలమైన క్యాడర్ను తీసుకొచ్చారు. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూపేష్ కుమార్ యాదవ్ ను కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చారు వేమిరెడ్డి. అయితే తాజాగా జమీన్ రైతు కథనంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు రూపేష్ కుమార్ యాదవ్. నేరుగా పత్రిక కార్యాలయానికి వెళ్లి ఎడిటర్ ముందు కూర్చుని దుర్భాషలాడారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా హక్కులను కాల రాస్తారా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఆ పత్రికది సుదీర్ఘ నేపథ్యం..
అయితే రాష్ట్రంలో జమీన్ రైతు( Jameen Ritu ) పత్రికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1930లో నెల్లూరు కేంద్రంగా ప్రారంభమైంది ఈ పత్రిక. నెల్లూరు వెంకట్రామనాయుడు చేతుల మీదుగా ఇది ప్రారంభం అయింది. మొదట జమీందారీ రైతు అనే పేరుతో వెలువడేది. కాలక్రమేనా జమీన్ రైతుగా మారింది. రైతుల పక్షాన నిలిచేది ఈ పత్రిక. ఈ పత్రికలో ఆత్రేయ, రావూరి భరద్వాజ, వంగూరి మొదలైన వారు పనిచేశారు. ప్రస్తుతం ఆ పత్రికను నెల్లూరు డోలెంద్ర ప్రసాద్ నడుపుతున్నారు. ప్రస్తుతం ఎడిటర్ గా ఉన్నారు. అయితే అటువంటి పురాతన పత్రిక పై టిడిపి నేతలు దాడి చేసినంత పని చేశారు. ఆ కథనంపై ఖండించి ఉంటే గౌరవంగా ఉండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రత్యేక ప్రకటన విడుదల చేసి ఉన్న ఇంత రాద్ధాంతం జరిగేది కాదని.. అయితే ఒకప్పటి వైసిపి నేత నేరుగా వెళ్లి ఎడిటర్ పై తిట్ల దండకాన్ని అందుకోవడం పై మాత్రం రకరకాల చర్చ నడుస్తోంది. ఈ కథనం నిజమేనని వారు ఒప్పుకున్నట్లు అయిందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. దీనిపై టిడిపి నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.