Love Betrayal : పెళ్లైన యువతి జీవితంతో ఆడుకున్న ప్రియుడు

Love Betrayal : ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడితో శారీరకంగా హద్దులు దాటేసింది. ఆ ప్రేమికుడితో పెళ్లి చేయడానికి పెద్దలు నిరాకరించారు. బలవంతంగా వేరే పెళ్లి చేసి పంపించారు. అక్కడ తిన్నగా ఉందా అంటే అదీ లేదు. మొగుడిని పట్టించుకోకుండా ఫోన్ కాల్స్ లో ప్రియుడితో మాట్లాడడం సాగింది.మరో మేఘాలయ హనీమూన్ మర్డర్ లాగా ఈమె తనను ఏదో చేస్తుందని డౌట్ వచ్చిన మొగుడు ఈ మహా ఇల్లాలిని పెద్ద మనుషుల ముందు పంచాయితీ పెట్టి వదిలించుకున్నాడు. సరే ప్రియుడితోనైనా కాలం గడుపుతామని అనుకున్న ఈమెకు ప్రియుడు సాంతం వాడేసి కాదు పొమ్మనడంతో ఇప్పుడు ఎటూ కాని పరిస్థితి ఎదురైంది.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరులో జరిగిన ఒక సంఘటన ప్రేమ, నమ్మక ద్రోహం, మానసిక క్షోభతో కూడిన ఒక విషాద కథను వెల్లడి చేసింది. అక్షిత అనే యువతి, అదే గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడిని ప్రేమించింది. అయితే, వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.

పెళ్లి, వేధింపులు, విడాకులు

కుటుంబ సభ్యుల అంగీకారం లేకపోవడంతో అక్షితకు కర్ణాటకకు చెందిన ఒక యువకుడితో వివాహం జరిగింది. అయితే, అక్షితను ప్రేమిస్తున్నానని చెప్పుకున్న సురేష్, ఆమెకు నిరంతరం ఫోన్ కాల్స్ చేస్తూ వేధించడం మొదలుపెట్టాడు. తన భార్యకు తరచుగా కాల్స్ వస్తుండటాన్ని గమనించిన అక్షిత భర్త, ఆరా తీయగా ఆమెకు పెళ్లికి ముందు సురేష్‌తో ఉన్న ప్రేమాయణం గురించి తెలిసింది.

ఈ మధ్యకాలంలో మేఘాలయ హనీమూన్ మర్డర్ లాగా భార్యాభర్తలు, వారి ప్రియులతో కలిసి భర్తలను చంపేస్తున్నారన్న వార్తలు విన్న భర్త, తన భార్య అక్షిత కూడా ప్రియుడు సురేష్‌తో కలిసి తనను చంపేస్తుందేమోనని భయపడ్డాడు. ఈ భయంతో, అక్షిత భర్త పెద్దల సమక్షంలో ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు.

మరోసారి మోసం

భర్తతో విడిపోయిన అక్షిత తిరిగి తన గ్రామానికి వచ్చింది. ఈ సమయంలో, “నేనున్నానంటూ” మాయమాటలు చెప్పి సురేష్ మళ్ళీ అక్షితకు దగ్గరయ్యాడు. ఆమెను శారీరకంగా వాడుకొని, పెళ్లి గురించి మాట్లాడగానే మొహం తిప్పేసుకున్నాడు.

సురేష్ దూరం పెట్టడంతో మోసపోయానని గ్రహించిన అక్షిత పోలీసులను ఆశ్రయించింది. అక్షిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలను, యువతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.

Leave a Comment