Jagan Vs Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) ప్రతిపక్షం దూకుడుగా ఉంటేనే అధికారంలోకి వచ్చేది. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేసి చూపించాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషించింది. అయితే 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంగా బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా రాలేదు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ తట పటాయిస్తోంది. ఎలా పూర్వవైభవం పొందాలో తెలియక సతమతం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి సైతం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ ఫార్ములాను అనుసరించేలా ఉన్నారు.
వేధింపులు భరించలేక..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు పడింది. అప్పట్లో తాజా మాజీ మంత్రుల అరెస్టు పర్వం కొనసాగింది. చివరికి చంద్రబాబును సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వదల్లేదు. గ్రామస్థాయిలో టిడిపి నేతల వాయిస్ ను నొక్కేశారు. విపరీతమైన దాడులు జరిగాయి. కేసులు కూడా కొనసాగాయి. లోకేష్ పాదయాత్ర చేస్తే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ మంత్రి అని చూడకుండా నేరుగా వచ్చి దుర్భాషలాడారు. అయితే ఈ చర్యలతో విసిగి వేసారి పోయిన నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా, అప్రజా స్వామికంగా వ్యవహరించిన అధికారులు, అధికార పార్టీ నేతల పేర్లు రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగబద్ధంగా వారందరినీ శిక్షిస్తామని అప్పట్లో లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.
రెడ్ బుక్ సంచలనమే
అయితే నాడు లోకేష్( Nara Lokesh) రెడ్ బుక్ సంచలనంగా మారింది. ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది. అయితే లోకేష్ మాదిరిగా బుక్ అంటే కాపీ చేసినట్టు ఉంటుందని భావించారు జగన్. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్ కార్యకర్తల కోసం తెచ్చారు. ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేసులతో ఇబ్బంది పెట్టే టిడిపి నేతలు, కూటమి నాయకులు, అధికారుల పేర్లు యాప్ లో పొందుపరిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఇది లోకేష్ రెడ్ బుక్ కు కాపీ కొట్టడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు లోకేష్ తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు.
గవర్నర్ ని ఎందుకు కలిశారు?
అయితే జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఇప్పుడు నేరుగా ఏదీ చెప్పలేకపోతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఆయన సతీమణి భారతి రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి దంపతులు రాష్ట్ర గవర్నర్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారు గవర్నర్ను మర్యాదపూర్వకంగానే కలిశారని చెబుతున్నారు. కేవలం ఆరోగ్యం గురించి వాకాబు చేయడానికి తాము గవర్నర్ ని కలిశామని చెప్పుకుంటున్నారు. అయితే గవర్నర్ అంతకు ముందు రోజు తీర్థయాత్రలకు వెళ్లారు. అటువంటి వ్యక్తికి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కలిశామని చెప్పడం నిజంగా ఆలోచించదగ్గ విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి దేనికో ఆందోళన పడుతున్నారు. అందులో భాగంగానే ఆయన గవర్నర్ ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.