Big Twist in AP Cabinet Expansion: ఏపీలో( Andhra Pradesh) మంత్రులు ఒక రకమైన భయం కనిపిస్తోంది. వారిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుండడం విశేషం. ‘మారండి లేకుంటే మార్చేస్తాను’ అన్న సీఎం చంద్రబాబు హెచ్చరిక వారిలో గట్టిగానే పని చేస్తోంది. మంత్రులు నేరుగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కీలక ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థి వైసీపీకి గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రుల కదలికలు మారాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. మారుమూల గ్రామాలకు సైతం వెళుతున్నారు. అయితే ఇదంతా సీఎం చంద్రబాబు హెచ్చరికల వల్లే సాధ్యమైందన్న టాక్ వినిపిస్తోంది. మారకపోతే మార్చేస్తాను అంటూ హెచ్చరికలే మంత్రులతో పని చేయిస్తున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. మంత్రుల దూకుడు చూస్తుంటే.. వారంతా సేఫ్ జోన్ లోకి వచ్చేందుకు ఆరాటపడుతున్నట్లు అర్థమవుతోంది.
పెద్ద ఎత్తున ప్రచారం..
సోషల్ మీడియా( social media) వచ్చాక క్షణాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ పై తెగ ప్రచారం నడుస్తోంది. ఏకంగా ఎనిమిది మంది మంత్రులపై వేటు వేస్తారని టాక్ నడుస్తోంది. ఇలా తొలగింపు జాబితాలో ఉన్న మంత్రులు వీరేనంటూ నేరుగా ప్రకటిస్తున్నారు. దీంతో ఈ జాబితాలో ఉన్న మంత్రులు ఆందోళనకు గురవుతున్నారు. మంత్రి పదవి చేపట్టి ఏడాదికే పదవులు ఊడిపోతే.. తమ రాజకీయ జీవితానికే మాయని మచ్చగా మిగిలిపోతామని ఎక్కువమంది భయపడుతున్నారు. అందుకే కాలికి బలపం పట్టుకొని మరి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. తమ జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే నిత్యం నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నాయి. దీంతో తామంతా సేఫ్ జోన్ లోకి వస్తామని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
మంత్రులంతా హాజరు..
ప్రస్తుతం రాష్ట్రమంతటా సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రులంతా పాల్గొంటున్నారు. మహిళా మంత్రులు సైతం ఉత్సాహంగా హాజరవుతున్నారు. ఈ శాఖ, ఆ శాఖ అన్న తేడా లేకుండా.. అన్ని శాఖల మంత్రులు ప్రజల్లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. అందులో జనసేన నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఒకరు ఉన్నారు. మిగతా 19 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి ఓ ఇద్దరూ.. ఉభయగోదావరి జిల్లాల నుంచి మరో ఇద్దరూ.. కోస్తాంధ్ర పరిధిలో మరో ఇద్దరు.. రాయలసీమ నుంచి ఇద్దరు మంత్రులు సర్వేల్లో వెనుకబడ్డారని.. వీరందరిపై వేటు వేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు సైతం ఎవరికి వారుగా మంత్రి పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇదంతా మంత్రుల్లో కలవరం పెంచేలా ఉంది. అందుకే సీఎం ఆదేశించినట్లు ప్రజల మధ్యకు వెళ్లేందుకు సూపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని వాడుకుంటున్నారు.
సీనియర్ మంత్రులు సైతం
ప్రస్తుతం సీనియర్ మంత్రులు( senior ministers) సైతం చురుగ్గానే పాల్గొంటున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి హెచ్చరికలే పంపుతున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు మంత్రులు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. దీంతో మిగిలిన 16 మంది మంత్రులు జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం ఒకవైపు.. సీనియర్ల ప్రయత్నాలు ఇంకోవైపు వారిలో కలవరానికి గురిచేస్తున్నాయి. అందుకే రెడ్, ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి వచ్చేందుకు మంత్రులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కనీసం ఆరెంజ్ జోన్లోకి వచ్చినా.. తాము సేఫ్ జోన్ లోకి వస్తామని భావిస్తున్నారు. చూడాలి వారి ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుతాయో..?