AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

AP Liquor Scam : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్టు అయ్యారు. ఇంకా ప్రముఖులు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. అయితే మరింత లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో.. ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇదే క్రమంలో భారీగా నగదు కూడా పట్టుబడుతోంది. తొలుత ఈ కుంభకోణంలో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి అరెస్టు అయ్యారు. అటు తరువాత సీఎం ఓలో ముఖ్య అధికారిగా ఉన్న ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సన్నిహితుడు బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. కొద్దిరోజుల కిందట రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్ కూడా కోర్టులో పొందుపరిచింది. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

* నిందితుడు ఇచ్చిన సమాచారంతో
కుంభకోణంలో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. అయితే ఎక్కువమంది పరారీలో ఉన్నారు. అయితే దర్యాప్తులో భాగంగా ఏ 40 నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం( Varun purushotam ) సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. అతడి వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు భారీగా నగదు పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇదంతా రాజ్ కసిరెడ్డి సూచన మేరకు చేసినట్లు అక్కడ నిర్వాహకులు తెలిపారు. ఈ సీజ్ ఘటనలో చాణుక్య, వినయ్ పాత్ర పై సిట్ బృందం విచారణ చేపట్టింది. ఈ నగదు ఎవరిచ్చారు? ఎవరు భద్రపరచమన్నారు? వంటి విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది.

* కూటమి వచ్చిన వెంటనే..
జూన్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే నెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో కదలిక వస్తుందని ముందే గ్రహించారు సూత్రధారి రాజ్ కసిరెడ్డి. ఆయన ఆదేశాల మేరకు 11 కోట్ల నగదు ఉన్న 12 అట్టపెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే రాజ్ కసిరెడ్డి, చాణుక్య, వినయ్ ల సాయంతోనే నగదును దాచినట్లు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించారు. దీంతో నేరుగా వెళ్లిన ప్రత్యేక దర్యాప్తు బృందం కట్టల కట్టల నగదును స్వాధీనం చేసుకుంది. అయితే మద్యం కుంభకోణంలో మున్ముందు మరింత నగదు పట్టుబడే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* దేశంలోనే పెద్ద స్కాం..
ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం రికార్డు సృష్టించింది. చత్తీస్గడ్ తో పాటు ఢిల్లీలో మద్యం కుంభకోణాలు జరిగాయి. వాటిని తలదన్నేలా ఏపీలో మద్యం స్కాం జరిగింది. ఏకంగా 3,500 కోట్ల రూపాయల స్కాం ఇది. ప్రభుత్వానికి దాదాపు 18 వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టారు. తిలా పాపం తలపిడికెడు అన్న చందంగా.. ఈ కుంభకోణంలో అప్పటి పాలకులతో పాటు కీలక అధికారులు సైతం తమదైన పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అయితే మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Comment