దేశ దిశ

సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం..

సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం..

సినీ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీఎఫ్‌డీపీ చైర్మన్‌, నిర్మాత దిల్‌రాజు అన్నారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్‌ ఇండిస్టీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో దిల్‌రాజు జెండా ఆవిష్కరించి, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సినీ కార్మిక సంఘాలు దిల్‌రాజుకు వినతి పత్రం అందజేశాయి. తెలుగుచిత్ర పరిశ్రమలోని 24 క్రాప్ట్స్‌లోని కార్మికులకు సరైన గుర్తింపు ఇవ్వాలి. డాన్స్‌, ఫైట్స్‌, యాక్టింగ్‌ రిహార్సల్స్‌ కోసం, సినీ కార్మికుల మీటింగ్‌ కోసం ఓ భవనం ఏర్పాటు చేయాలి. సినీ కార్మికుల కోసం ఓ హాస్పిటల్‌ కట్టించాలి. సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్‌ భవనాన్ని నిర్మించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సినీ కార్మికులకు అందేలా చూడాలి. ఇల్లులేని కార్మికులకు స్థలం కేటాయించాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందజేయబోతున్న గద్దర్‌ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఫెడరేషన్‌ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారికి ప్రత్యేక జ్ఞాపికలు ఇవ్వాలి. ఈ విషయాలపై దిల్‌రాజు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. దీనిపై దిల్‌రాజు స్పందిస్తూ, ‘ఓ నిర్మాతగా, టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా సినీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాను’ అని తెలిపారు.

– Advertisement –

Exit mobile version