దేశ దిశ

సింహాచలం ఆలయంలో ఘోర ప్రమాదం…ఏడుగురి మృతి

సింహాచలం ఆలయంలో ఘోర ప్రమాదం…ఏడుగురి మృతి

విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా అపశృతి జరిగింది. గోడ కూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే దారిలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్‌ క్యూలైన్‌ సమీపంలోని సిమెంట్ గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో, రూ.300 దర్శన టికెట్ల మార్గంలో నిర్మించిన గోడ దగ్గర భక్తుల సౌకర్యార్థం ఓ భారీ టెంట్ వేశారు. అయితే, బుధవారం తెల్లవారుఝామున భారీ ఈదురుగాలులు వీయడంతో ఆ టెంట్ క్యూలైన్ పక్కనే ఉన్న గోడపై పడిందని, ఒక్కసారిగా గోడ కూలి భక్తుల మీద పడిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో భక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. తప్పించుకునే వీలు లేక వారంతా నిద్రలోనే ప్రాణాలు విడిచారు.

సింహాద్రి అప్పన్న చందనోత్సవాల్లో భాగంగా 20 రోజుల క్రితం ఈ గోడ నిర్మించారని తెలుస్తోంది. రూ.300, రూ.1000 టికెట్ లైన్లను క్యూ కాంప్లెక్స్ కు అనుసంధానిస్తూ ఈ గోడ నిర్మాణం చేపట్టారు. అయితే, గోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆ కాంట్రాక్టర్ గోడ నిర్మాణం కోసం కాంక్రీట్ బీమ్, దిమ్మె నిర్మించకుండానే 20 అడుగుల గోడ కట్టారని తెలుస్తోంది. ఈదురు గాలులకు టెంట్ గోడపై పడిందని, అప్పటికే వర్షపు నీరు గోడ కిందకు చేరడంతో గోడ బలహీన పడిందని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

The post సింహాచలం ఆలయంలో ఘోర ప్రమాదం…ఏడుగురి మృతి first appeared on namasteandhra.

Exit mobile version