దేశ దిశ

విడదల రజనీకి బిగ్ షాక్!

విడదల రజనీకి బిగ్ షాక్!

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల ర‌జినిపై పలువురు వ్యాపారులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా ఉన్న సమయంలో రజనీ తన అధికారాన్ని అడ్డుపెట్టకొని క్వారీ యజమానులను బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రజనీపై ఏసీబీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రజనీ మరిదిని గోపీపై కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో, తాజాగా రజనీ మరిది గోపీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైద‌రాబాద్‌లో గోపీని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనను విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. య‌డ్ల‌పాడులో కంక‌ర క్వారీ య‌జ‌మానుల‌ను బెదిరించి డ‌బ్బు వ‌సూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గోపీ, రజనీలపై గతంలోనే కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఏపీ ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేశారు. దీంతో, రజనీకి షాక్ తగిలినట్లయింది.

రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు చేసింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు నమోదయ్యాయి. యాజమాన్యాన్ని బెదిరించి సుమారు రూ.2.20 కోట్లు వసూలు చేశారని రజనీపై ఆ క్రషర్ యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రజనీపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆమెను ఏ1గా చేర్చారు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదు కాగా… ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ రామకృష్ణలను చేర్చారు.

మరోవైపు, ఏసీబీ కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోసం విడదల రజినీ, గోపి హైకోర్టును ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారి జాషువా క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్‌లో పెట్టింది.

Exit mobile version