– భూభారతిపై నూతనకల్‌లో అవగాహనా సదస్సు
నవతెలంగాణ -నూతనకల్
రైతు సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం భూభారతిపై అవగాహనా సదస్సులో మంత్రి ప్రసంగించారు. ధరణి చట్టం దొరల స్వార్థం కోసం తెచ్చిన చట్టమన్నారు. ఆ చట్టంలోని లోపాలను సవరించి రైతు సంక్షేమం కోసం భూభారతి తీసుకొచ్చామన్నారు. ఒక రైతుకు ఉన్న ఆరు ఎకరాల భూమికి ధరణి చట్టం రాకముందు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లబ్దిని పొందారని, ధరణి వచ్చాక భూమే తన పేరు మీద లేకుండాపోయిందని అన్నారు. ఇలా అనేక మంది రైతులకు సమస్యలు ఉన్నాయన్నారు. వంశ పారంపర్యంగా వచ్చిన భూమి గతంలో రికార్డులో, పట్టాదారి పుస్తకంలో ఉన్నప్పటికీ ధరణి చట్టంతో ఆన్‌లైన్ రికార్డులు కనపడక రైతులు అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరామ్మ రాజ్యంలో భూభారతి చట్టంపై కోదండరెడ్డితో ఒక కమిటీ వేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో వచ్చిన రెండు లక్షల 46వేల దరఖాస్తులను, ప్రస్తుత మూడున్నర లక్షల దరఖాస్తులను ఏడాది నాలుగు నెలల్లోనే పరిష్కరించినట్టు చెప్పారు. గతంలో ఒక్క కలెక్టర్‌కే ఉన్న అధికారాలను విభజించి తహసీల్దార్, ఆర్డీవోకు విభజించామని, అధికార వికేంద్రీకరణ చేశామని తెలిపారు. 18 రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించిన తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. పేదవాడికి ఉపయోగపడే విధంగా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పారదర్శకంగా రైతులకు భూపట్టాలను ఇవ్వాలన్నారు. ప్రతి అధికారీ దాదాపు రైతు కుటుంబం నుండే వచ్చారు కాబట్టి ఆ బాధ వారికి తెలుసు అని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ రెవెన్యూ అధికారి తప్పు చేసినా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మండలంలో ఉన్న జన్నారెడ్డి ప్రతాపరెడ్డి భూమిని 70 ఏండ్ల కిందట కొనుగోలు చేసి.. రికార్డులో, కబ్జాలో ఉన్న ప్రతి రైతుకూ పట్టాలు చేయడం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఆ అంశాలను తమ దగ్గరికి పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కోరిక మేరకు నియోజకవర్గానికి 3500 ఇండ్లతో పాటు దశలవారీగా ఇంకా ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మెన్ తీగల గిరిధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్‌పవార్, ఎస్పీ నరసింహ, పీఏసీఎస్ చైర్‌పర్సన్ నాగం జయసుధ, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపీడీవో సునీత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.